Rating: 2.5/5

రివ్యూ: గల్లి బోయ్‌
రేటింగ్‌: 3.5/5
బ్యానర్‌: ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టైగర్‌ బేబీ ప్రొడక్షన్స్‌
తారాగణం: రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌, కల్కి కోక్లేన్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, విజయ్‌ రాజ్‌, విజయ్‌ వర్మ, అమృతా సుభాష్‌, షీబా చడ్డా తదితరులు
సంగీతం: డివైన్‌, నాజీ, డబ్‌ శర్మ, అంకుర్‌ తివారీ తదితరులు
కూర్పు: నితిన్‌ బైద్‌
ఛాయాగ్రహణం: జే ఓజా
నిర్మాతలు: రితేష్‌ జిద్వాని, జోయా అక్తర్‌, ఫర్హాన్‌ అక్తర్‌
రచన, దర్శకత్వం: జోయా అఖ్తర్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2019

బాలీవుడ్‌ అంటే ముగ్గురు ఖాన్‌ల తర్వాతే అనేది స్థిరపడిపోయి చాలా కాలమైంది. హృతిక్‌, రణ్‌భీర్‌ కపూర్‌ లాంటి వాళ్లు అడపాదడపా మెరుస్తున్నా కానీ వారిలో నిలకడ లోపించింది. కథల ఎంపికలోనే కాకుండా, పాత్రల పరంగా వైవిధ్యం చూపించడంలో రణ్‌వీర్‌సింగ్‌ ప్రతి సినిమాతోను సత్తా చాటుకుంటూ... బాలీవుడ్‌కి నెక్స్‌ట్‌ సూపర్‌స్టార్‌గా అవతరిస్తున్నాడు. బాజీరావు, అల్లావుద్దీన్‌ ఖిల్‌జీ, సింబా... ఇలా ప్రతి సినిమాలోను సరికొత్తగా కనిపిస్తోన్న రణ్‌వీర్‌సింగ్‌... 'గల్లీబోయ్‌'లో సగటు స్లమ్‌ కుర్రాడిగా అవలీలగా ఒదిగిపోయాడు. ఎంత స్టార్‌డమ్‌ వచ్చినా పాత్రకి అనుగుణంగా ఒదిగిపోవడమే గొప్ప నటుల లక్షణం.

'గల్లీబోయ్‌' ఓపెనింగ్‌ సీన్‌లో విజయ్‌ రాజ్‌ కారు దొంగతనం చేయడానికి వడివడిగా వెళుతుంటాడు. వెనక నుంచి ఇద్దరు కుర్రాళ్లొచ్చి జాయిన్‌ అవుతారు. వారిలో ఒకడు మురాద్‌ (రణవీర్‌ సింగ్‌). ఎంత డీగ్లామ్‌ క్యారెక్టరయినా కావాలనుకుంటే... ఈ కథలోను అతనికో సోలో ఇంట్రడక్షన్‌ సీన్‌ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నారని ఎవరూ కంప్లయింట్‌ చేయరు కూడా. కానీ ఆ పాత్ర సగటు స్లమ్‌ బాయ్‌ ఎలా వుంటాడో అలాగే వుంటుంది... ఎలాంటి బిల్డప్పులు లేకుండా. ర్యాప్‌ సాంగ్స్‌ అంటే మురాద్‌కి పిచ్చి. ఎప్పుడూ ర్యాప్‌ సాంగ్స్‌ వింటూ... తనకొచ్చిన కవిత్వం రాసుకుంటూ వుంటాడు. ర్యాపర్‌ కావాలని కూడా అనుకోడు. ఎవరైనా మంచి ర్యాపర్‌ చేతిలో తన సాహిత్యం పెడితే చాలనుకుంటాడు.

అతనికి లోకల్‌ ర్యాపర్‌ షేర్‌ (సిద్ధాంత్‌ - తొలి పరిచయంలోనే విశేషంగా మెప్పించే పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు) పరిచయమవుతాడు. తన సాహిత్యం తాను రాసుకోగలనని, నీ సాహిత్యానికి నువ్వే గొంతు కావాలని షేర్‌ ప్రోత్సహించడంతో మురాద్‌ ఒక ర్యాప్‌ సాంగ్‌ రికార్డ్‌ చేసి యూట్యూబ్‌లో పెడతాడు. పాట బాగా పాపులర్‌ అవుతుంది. వీడియో చూసిన అతని తండ్రి ఆనంద పడడు. చదువు మీద ధ్యాస లేకుండా పక్కదార్లు పడుతున్నాడని కొడతాడు. ఒక మంచి బ్రేక్‌ కోసం చూస్తోన్న మురాద్‌, షేర్‌లకి సంయుక్తంగా ఒక 'మంచి వీడియో' రికార్డ్‌ చేసే వీలు చిక్కుతుంది. ఎన్నారై స్కై (కల్కి - చాలా స్టాక్‌ క్యారెక్టర్‌. కల్కిలాంటి ఉత్తమ నటి కూడా ఆ పాత్రని మరో లెవల్‌కి తీసుకెళ్లలేపోయింది) సాయంతో ఈ వీడియో చేసి సక్సెస్‌ అవుతారు. కానీ మురాద్‌కి అడుగడుగునా పేదరికం అడ్డవుతుంది. తప్పక సంపాదించాల్సిన పరిస్థితులు వస్తాయి. తన పేదరికానికి, తన భవిష్యత్తుకి సమాధానంగా ర్యాప్‌ కంటెస్ట్‌ జరుగుతుంది. ప్రథమ బహుమతి పది లక్షలు!