Rating: 2.5/5

రివ్యూ: లవర్స్‌ డే

రేటింగ్‌: 1.5/5

బ్యానర్‌: సుఖీభవ సినిమాస్‌

తారాగణం: రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌, నూరిన్‌ షెరీఫ్‌, షియాద్‌ షాజహాన్‌ తదితరులు

మాటలు: ఎం. రత్నం

కథనం: సారంగ్‌ జయప్రకాష్‌, లిజో పనాడా

కూర్పు: అచ్చు విజయన్‌

సంగీతం: షాన్‌ రెహమాన్‌

ఛాయాగ్రహణం: సిను సిద్ధార్థ్‌

నిర్మాత: ఏ. గురురాజ్‌

కథ, దర్శకత్వం: ఒమర్‌ లులు

విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2019

టీజర్‌ వైరల్‌ అయిన తర్వాత దాని చుట్టూ కథ అల్లుకున్నారా లేక ఊహించనంతగా పాపులర్‌ అయిన టీజర్‌ కోసం కథ మార్చేసారా? కారణమేదైనా కానీ ఈ 'లవర్స్‌ డే' సదరు టీజర్‌ని దాటి మెరవలేకపోయింది. విశేషం ఏమిటంటే అంతగా పాపులర్‌ అయి, ఎక్కడంటే అక్కడ దర్శనమిచ్చిన ఆ టీజర్‌లోని షాట్స్‌ తెరపై ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించాయి. మాటలు లేకుండా మూగ సైగలతోనే టీనేజీ ఆకర్షణలు, తొలిప్రేమని అంత అందంగా చూపించగలిగిన దర్శకుడు ఈ చిత్రాన్ని అంత రసరమ్యంగా తీర్చిదిద్దలేకపోయాడు.

 

'ఇలాంటి స్కూల్స్‌ కూడా వుంటాయా?' అనిపించేలాంటి ఒక విచిత్రమైన స్కూల్‌లో ప్లస్‌ వన్‌ విద్యార్థులు రోషన్‌, ప్రియ తొలిరోజే ప్రేమలో పడతారు. కొద్ది రోజుల్లోనే ఆమెని అతను ముద్దు కూడా పెట్టేసుకుంటాడు. ఇవన్నీ చాలా కామన్‌ విషయాల్లా స్కూల్లో అందరూ మాట్లాడేసుకుంటూ వుంటారు. దర్శకుడి కన్వీనియన్స్‌ని బట్టి ఈ స్కూల్లో అప్పుడప్పుడూ టీచర్లు కనిపిస్తుంటారు. వాళ్లు కనిపించినపుడు వీళ్లు కనిపించకపోతేనే బాగుణ్ణు అన్నట్టు బిహేవ్‌ చేస్తుంటారు.

 

ప్లస్‌ వన్‌కి రావడం అంటే ప్రేమించడానికి అర్హత సాధించారన్నట్టు కనిపించే ప్రతి పిల్ల, పిల్లాడు ఎవరో ఒకరితో సెటిల్‌ అయిపోతూ వుంటారు. అసలు జంట ప్రియ, రోషన్‌లని తొలి సీన్‌లోనే ప్రేమలో పడిపోవడం వలన రొమాన్స్‌ బిల్డప్‌కి వాడుకునే సమయాన్ని వృధా చేసుకున్న దర్శకుడు ఆ గ్యాప్‌ని ఎలా ఫిల్‌ చేయాలో తెలియక చచ్చు కామెడీ సీన్లని, ఇంటర్‌ పిల్లల వెకిలి వేషాల్ని చూపించి నవ్వుతారా, ఛస్తారా అన్నట్టు క్రియేటివ్‌ దండన విధిస్తాడు. ఇంటర్వెల్‌ టైమ్‌కి 'అరేయ్‌ ఏంట్రా ఇదీ' అంటూ ఒక్కో ప్రేక్షకుడి ముఖంపై ఆ పాపులర్‌ మీమ్‌ ఎక్స్‌ప్రెషన్‌ పలికేట్టు చేస్తాడు.

 

అటునుంచి కథ కన్వీనియంట్‌గా అడ్డదార్లు తొక్కుతూ పోతుంది. ఒకానొక పొరపాటు వల్ల అసలు జంట ప్రేమకి అంతరాయం ఏర్పడుతుంది. ఈలోగా అంతవరకు తనకి స్నేహితురాలయిన అమ్మాయిపైకి అబ్బాయి దృష్టి మరలుతుంది. కన్నుగీటిన దృశ్యంతో పాటు తన ముద్దు తుపాకీతో ఈ చిత్రానికి ఇంత పాపులారిటీ తెచ్చిన ప్రియ దర్శకుడి కన్వీనియన్స్‌ కోసం సైడ్‌ అవగా, మరో అమ్మాయి (నూరిన్‌ షెరీఫ్‌) ఫ్రంట్‌ సీట్‌ తీసుకుంటుంది. స్టోరీ డిమాండ్‌ చేయడం కంటే దర్శకుడి కన్వీనియన్స్‌కి తగ్గట్టు క్లయిమాక్స్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. సదరు సన్నివేశంతో కన్నీళ్లు పెట్టించాలని, గుర్తుండిపోయే లవ్‌స్టోరీ అవ్వాలనేది దర్శకుడి ఉద్ధేశం కావచ్చు. కానీ అది బలవంతపు ముగింపులానే వుంటుంది తప్ప ఆశించిన రెస్పాన్స్‌ రాబట్టుకోలేదు.