Rating: 2.0/5

రివ్యూ: దేవ్‌
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ప్రిన్స్‌ పిక్చర్స్‌
తారాగణం: కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, ఆర్‌జే విఘ్నేష్‌, అమృతా శ్రీనివాసన్‌, రేణుక, నిక్కీ గాల్రానీ తదితరులు
సంగీతం: హారిస్‌ జయరాజ్‌
కూర్పు: ఆంటోని ఎల్‌. రూబెన్‌
ఛాయాగ్రహణం: ఆర్‌. వేల్‌ రాజ్‌
నిర్మాత: ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌
రచన, దర్శకత్వం: రజత్‌ రవిశంకర్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2019

రజత్‌ రవిశంకర్‌ టాలెంట్‌ 'దేవ్‌' తీసినదాంట్లో కంటే... ఈ సినిమా చేయడానికి కార్తీ, రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌ లాంటి వాళ్లని ఒప్పించడంలో, దీనిపై ఇన్ని కోట్లు పెట్టడానికి నిర్మాతని కన్విన్స్‌ చేయడంలో కనిపిస్తుంది. 'దేవ్‌' చూస్తున్నంతసేపు వీళ్లకి ఏమి చెప్పి ఈ చిత్రం తీయడానికి ఇంతమందిని ఒప్పించగలిగాడనే ప్రశ్నే మదిని తొలిచేస్తుంటుంది. ఈమధ్య కాలంలో ఇంత పాయింట్‌లెస్‌ ఎక్సర్‌సైజ్‌ తెరపై చూసి వుండరు.

సినిమా మొదలైన తీరు చూస్తే ఇదేదో 'జిందగీ నా మిలేగీ దొబారా' స్టయిల్లో బడ్డీ రోడ్‌ ట్రిప్‌ మూవీ అనిపిస్తుంది. కానీ రొటీన్‌కి భిన్నంగా ఛాలెంజ్‌లు, అడ్వెంచర్‌లు ఇష్టపడే తత్వమున్నవాడని పరిచయం చేసిన హీరో కాసేపటికే 'లవర్‌బాయ్‌'గా మారిపోతాడు. ఒక కార్పొరేట్‌ లేడీకి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి ఆమెని ఎలాగైనా తన ప్రేమలో దించే పనిలో మునిగిపోతాడు. ఇప్పటికి అతనికి ఇదే ఒక అడ్వెంచర్‌ అని క్యారెక్టర్‌ని జస్టిఫై చేసుకోవడానికి గట్టిగా ట్రై చేస్తాడు.

తల్లి చనిపోతే తండ్రి పెంపకంలో పెరిగిన కొడుకు హీరో అయితే, తల్లిని వదిలేసిన తండ్రిపై కోపాన్ని, మగాళ్లపై ద్వేషాన్ని పెంచుకున్న అమ్మాయి హీరోయిన్‌. ఈ ఇద్దరి లవ్‌స్టోరీలో చెప్పుకోతగ్గ విశేషాలేమీ వుండవు. ఆమెని కన్విన్స్‌ చేయడానికి హీరో ఏమంత గొప్ప విన్యాసాలూ చేయడు. మగాళ్లపై వున్న ద్వేషం స్థానంలో అతనిపై ఇష్టం పెంచుకోవడానికి తగ్గ కారణాలూ ఆమె వెతుక్కోదు. సినిమా స్టార్ట్‌ అయి ఇంతసేపయింది కనుక ఇక వారిద్దరి మధ్య పరిచయం పెంచాలని దర్శకుడు అనుకున్నప్పుడు కలుస్తారు. ఇంటర్వెల్‌ ఇవ్వడానికి రీజన్‌ కావాలన్నపుడు ఏదో కారణం మీద కాస్త దూరమవుతారు.

ఈ కథనంతా హీరో స్నేహితుడు 'స్టాండప్‌ కామెడీ' షోలో చెబుతుంటాడు. ఎట్‌లీస్ట్‌ తాను రాసుకున్న స్టోరీ చాలా సిల్లీగా, కామెడీగా వుందని దర్శకుడు ఇలా సిన్సియర్‌గా ఒప్పుకున్నందుకు అభినందించాలి. ఇంటర్వెల్‌కి కూడా కొలిక్కి రాని లవ్‌స్టోరీ ఆ తర్వాత ఒక రోడ్‌ ట్రిప్‌లో బలపడుతుంది. ఇక అక్కడ్నుంచి ఎలా నడిపించాలో తెలియదన్నట్టు ఫోటోగ్రాఫర్‌ హీరోలోంచి ఆర్కిటెక్ట్‌ బయటకి వస్తాడు. సడన్‌గా తండ్రి కోసం ఒక నిర్మాణం చేపడతాడు. పనీ పాటా లేకుండా తన వెంట తిరుగుతూ ఎంటర్‌టైన్‌ చేస్తాడని అతడిని వలచిన హీరోయిన్‌ అతను బిజీ అయ్యేసరికి వదిలేసి పోతుంది.