“పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగిన మొదటి ప్రధాని మోదీ” ఇదీ సామాజిక మాధ్యమాలలో తిరుగుతున్న సందేశం. నిజమే ఈ పని చేసిన మొదటి ప్రధాని మోదీనే. అనుమానం లేదు. అయితే కాళ్లు కడగడం ఏ సంస్కృతికి నిదర్శనమో గ్రహించాలి. అది పచ్చి ఫ్యూడల్ సంస్కృతి. మోదీ హయాంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ఏం జరిగిందో తరచి చూడాలి. 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో ఏమీ జరగలేదుగా అన్నది సమాధానం కాదు. కాంగ్రెస్ విఫలమైందనుకున్నందువల్లే జనం మోదీకి పట్టం కట్టారు.

సానుభూతికి సహానుభూతికి తేడా ఉంది. ఎవరకైనా ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఆపద వచ్చినా అయ్యో అనడం సానుభూతి. వారి బాధలు నివారించడానికి చేయగలిగినంత చేయడం సహానుభూతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సఫాయి కార్మికుల మీద సానుభూతే కాదు, సహానుభూతీ అపారంగా ఉన్నట్టుంది. బుధవారం నాడు ఆయన కుంభమేళాలో పారిశుద్ధ్య పనులు నిర్వహించిన వారిని ప్రశంసించారు.

ఫిబ్రవరి 24న మోదీ ప్రయాగ్ రాజ్ లో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. కుంభమేళాలో ఆ కార్మికులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పని చేశాను అని మోదీ చెప్పారు. వారు నిజమైన కర్మయోగులని అన్నారు. “కుంభ మేళా సందర్భంగా వాళ్లు ఎంత శ్రమిస్తున్నరో ఎవరికీ తెలియదు. ఈ కుంభ మేళా ప్రత్యేకత పారిశుద్ధ్యమే. మీ ఆశీస్సులు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను. మీకు సేవలు అందిస్తూనే ఉంటాను” అని మోదీ అన్నారు.

కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి వ్యక్తిగతంగా 21 లక్షలు మోదీ అందజేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఇది సహానుభూతే. ప్రయాగ్ రాజ్ లో (అదే మునుపు అలహాబాద్ అనే వాళ్లం లెండి) జరిగిన కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడం సహజం. అక్కడ పారిశుద్ధ్యం సవ్యంగా ఉండవలసిందే. ఆ పని సఫాయి కార్మికులు బాగా చేసినందుకు మోదీ అభినందించడం మెచ్చుకోదగ్గదే. సమాజంలో అట్టడుగున ఉన్న వారి శ్రమను మెచ్చుకునే ప్రధానమంత్రి ఉన్నందుకు సంతోషించవలసిందే.

మోదీ వాళ్లను “కర్మ యోగులు” అన్నారు. కర్మ అంటే పురుష ప్రయత్నం, పట్టుబట్ట, పౌరుషం అన్న అర్థాలూ ఉన్నాయి. కర్మ అన్న మాటను “ఖర్మ” అని కూడా వాడతాం. ఖర్మ అని వాడితే దిక్కులేక అన్న అర్థం వస్తుంది. మోదీ కర్మ అన్న అర్థంలోనే వాడి ఉంటారనుకోవాలి. ఎందుకంటే కర్మను ఖర్మ అని వాడడం తెలుగులో అయితే ఉంది కానీ ఉత్తరాది భాషల్లో ఉండే అవకాశం తక్కువ. సఫాయి కర్మచారులు సాంకేతికత బాగా అభివృద్ధి చెందిన ఈ దశలో కూడా విషవాయువులు విరజిమ్మే మురికి కాలవల్లోకి దిగి శుభ్రం చేయడం, ఆ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇతరుల మలాన్ని తల మీద మోసుకెళ్లి పారబోయడం తప్పకపోవడం వారి ఖర్మే.