Rating: 4.0/5

రివ్యూ: ఎఫ్‌ 2 - ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహ్రీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, బ్రహ్మాజీ, అన్నపూర్ణ, అనసూయ, నాజర్‌, ఝాన్సీ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి
సమర్పణ: దిల్‌ రాజు
నిర్మాతలు: రాజు, శిరీష్‌
రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
విడుదల తేదీ: జనవరి 12, 2019

భార్యాభర్తల జగడాలు, కీచులాటలు తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి సక్సెస్‌ ఫార్ములా అని గతంలోనే రుజువయింది. ఈ జోనర్‌కి పూర్తిగా అంకితమైపోయి పదుల కొద్దీ సినిమాలు తీసిన దర్శకులున్నారు. అయితే గత దశాబ్ధ కాలంగా ఈ కాన్సెప్ట్‌ని సినిమా వాళ్లు వదిలేస్తే, ఇదే కాన్సెప్ట్‌తో కామెడీ స్కిట్స్‌ చేస్తూ టీవీలో జబర్దస్త్‌గా అదరగొట్టేస్తున్నారు యువ కమెడియన్లు. బాక్సాఫీస్‌ పరంగా కాలం చెల్లిపోయిందని అనుకున్న ఈ ఫార్ములాకి కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇచ్చి 'ఎఫ్‌ 2' అంటూ మగాళ్లు, ముఖ్యంగా మొగుళ్ళ ఫ్రస్ట్రేషన్‌ని, తద్వారా ఉత్పన్నమయ్యే ఫన్‌ని మన ముందుకి తీసుకొచ్చాడు అనిల్‌ రావిపూడి.

కథాపరంగా ఇందులో చెప్పుకోతగ్గ స్టఫ్‌ లేదు. అయితే ఫన్‌ క్యారెక్టర్స్‌ని, ఫన్నీ సిట్యువేషన్స్‌ని సృష్టించి సినిమా చూస్తున్నంతసేపు టైమ్‌ పాస్‌ చేయడంలో ఎఫ్‌2 డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఈ ప్రాసెస్‌లో వెంకటేష్‌ని బ్రహ్మాస్త్రంగా వాడుకున్నాడు. ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ వున్న వెంకటేష్‌తో ఒక హీరో పాత్ర చేయించడంతో ఆయనకి స్వతహాగా వున్న కామెడీ టైమింగ్‌ ఈ చిత్రానికి భలేగా హెల్ప్‌ అయింది. కొన్ని సాధారణ సన్నివేశాలని కూడా వెంకీ తన హాస్యంతో నిలబెట్టేసాడు. వెంకటేష్‌కి బ్రదర్‌గా వరుణ్‌ తేజ్‌ కూడా యాప్ట్‌గా వున్నాడు. గతంలో కామెడీ చేసిన అనుభవం లేకపోయినా బెరుకు లేకుండా నటించాడు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఎఫ్‌2 సీన్స్‌ ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్‌ చూపించగలిగాయి.

ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్‌, వారికి తమ ఆడాళ్ళతో ఎదురయ్యే ఫ్రస్ట్రేషన్‌తోనే నడుస్తుంది. ఇదంతా విసిగించకుండా వినోదాత్మకంగా సాగడానికి తోడు కొన్ని సందర్భాలలో పొట్ట చెక్కలయ్యే  హాస్యం కూడా పండడంతో 'ఎఫ్‌2' ఫస్ట్‌ హాఫ్‌ పైసావసూల్‌ అనిపించేస్తుంది. మిగతాదంతా బోనస్‌ అని ఆడియన్స్‌తో పాటు డైరెక్టర్‌ కూడా ఫీలవడం వలనో ఏమో ద్వితియార్ధంపై ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్టు లేడు. ఫస్ట్‌ హాఫ్‌లో వున్న ఫన్‌ సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి చాలా వరకు తగ్గుతుంది. ఫన్‌ మోడ్‌ నుంచి డైవర్ట్‌ కాకపోయినప్పటికీ మొదటి సగంలో పండిన హాస్యాన్ని మ్యాచ్‌ చేయడం ద్వితియార్ధం వల్ల కాలేదు. అయినప్పటికీ అడపాదడపా నవ్వించే సన్నివేశాలతో కాలక్షేపమయితే అయిపోతుంటుంది. ఫస్ట్‌ హాఫ్‌ రేంజ్‌లో సెకండ్‌ హాఫ్‌ కూడా కామెడీ పండినట్టయితే ఈ చిత్రం మరో రేంజ్‌కి వెళ్లిపోయి వుండేది.

కానీ సెకండ్‌ హాఫ్‌ అంతా గ్యాప్‌ ఫిల్లింగ్‌ వ్యవహారంలా, ఈ తంతుని ఎలాగోలా ముగించాలి అనే పద్ధతిలో సాగిపోవడంతో ఒకింత నిరాశ కలుగుతుంది. అయినప్పటికీ చాలా వరకు లోపాలని వెంకటేష్‌ అండ్‌ కో కవర్‌ చేసేయడంతో అనిల్‌ రావిపూడి పని సులువైంది. ఫస్ట్‌ హాఫ్‌లో హజ్బెండ్స్‌ని విక్టిమ్స్‌గా చూపించిన అనిల్‌ రావిపూడి సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి వైవ్స్‌ సైడ్‌ తీసుకుని సగటు దిల్‌ రాజు సినిమా దర్శకుడిలా వాళ్లని మెప్పించే ప్రయత్నం చేయడం ఆడ్‌గా అనిపిస్తుంది.