వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక టీడీపీ హస్తం లేకపోతే సీబీఐ విచారణకు ఆదేశించేందుకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం జగన్‌ మాట్లాడారు. 

చనిపోయిన వ్యక్తి ఏమీ చిన్నవాడు కాదని.. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, రెండు సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి అని జగన్‌ అన్నారు. ఒంటరిగా ఉంటున్నారన్న విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లి హత్య చేయడం ఏమిటని ప్రశ్నించారు. చివరకు గన్‌మెన్లు కూడా లేకుండా ఎక్కడికైనా వెళ్లే …. అజాత శత్రువు తన బాబాయి అన్నారు. అలాంటి వ్యక్తిని కూడా ఇలా చంపడం దారుణమన్నారు.

జమ్మలమడుగు వైసీపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్నారనే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారన్నారు జగన్. కనీసం ఎన్నికలు పూర్తయ్యే వరకు డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పించాలని జగన్‌ డిమాండ్ చేశారు.

23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఇదే ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు, ఏబీఎన్ రాధాకృష్ణ దగ్గరుండి బేరాలు నడిపి కొనుగోలు
చేశారన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ వ్యవస్థను చంద్రబాబు ఇంటి వద్ద వాచ్‌మెన్‌ కంటే దారుణంగా తయారు చేశారన్నారు.

గతంలోనూ వైఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన్ను కడప జిల్లాకే పరిమితం చేయాలన్న ఉద్దేశంతో తన తండ్రి రాజారెడ్డిని ఇదే చంద్రబాబు హత్య చేయించారన్నారు జగన్. చంద్రబాబు ఫినిష్ అవుతావ్ అన్న రెండు రోజులకే వైఎస్ హెలికాప్టర్ కూలిపోయిందన్నారు. అత్యంత భద్రత ఉండే ఎయిర్‌పోర్టులో తనపై దాడి చేశారన్నారు.