రాబోయే సాధారణ ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలియదు కానీ…. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా జరిగాయి.

ఇప్పటివరకు ప్రెసిడెంట్ గా చలామణి అయిన శివాజీరాజా ఘోర పరాజయం పాలయ్యారు. కొత్తగా నరేష్ ప్యానెల్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కాగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 22న జరగనుంది. కానీ శివాజీ రాజా పదవి కాలం మాత్రం ఈ నెల 31 వరకు కొనసాగనుంది.

ఈ నేపథ్యంలో తన పదవి గడువు ఉన్నంతవరకు ‘మా’ కుర్చీలో ఎవరూ కూర్చో కూడదు అని…. అలా కూర్చుంటే కోర్టుకు వెళతానని శివాజీరాజా బెదిరిస్తున్నాడని నరేష్ అంటున్నారు.

రిటర్నింగ్ ఆఫీసర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, జనరల్ సెక్రెటరీ జీవిత రాజశేఖర్ మరియు ‘మా’ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నరేష్ మాట్లాడుతూ…

” ‘మా’ లో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు అందర్నీ కలుపుకుంటూ పోవాలని నిర్ణయించుకున్నాను. కానీ మమ్మల్ని మా పని చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇండస్ట్రీలో పెద్దల అంగీకారంతో, వారి సమక్షంలోనే ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ శివాజీ రాజా తన పదవీకాలం 31 వరకు ఉందని, అప్పటివరకు ‘మా’ కుర్చీలో ఎవరు కూర్చో కూడదు అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు” అని చెప్పుకొచ్చారు నరేష్.

ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలు ఎలా చెబితే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నామని నరేష్ పేర్కొన్నారు.