• బీసీసీఐ ముందు ప్రతిపాదన ఉంచిన స్టార్ ఇండియా
  • రాజకీయ, మతపరమైన ప్రకటనలతో వేలకోట్ల ఆదాయం
  • ఎన్నికలు, మతకార్యక్రమాలతోనూ స్టార్ ఇండియా వ్యాపారం?
  • క్రికెట్ క్రేజీ భారత్ లో క్రికెట్, ఐపీఎల్ ప్రత్యక్షప్రసార కార్యక్రమాలతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న అధికారి బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్…. ప్రకటనల ద్వారా…. ఏకంగా వేలకోట్ల రూపాయలు సంపాదించడానికి ఓ సరికొత్త ఆలోచనను బీసీసీఐ ముందు ఉంచింది.

సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసార సమయంలో బహుళ జాతి సంస్థల యాడ్లు మాత్రమే ప్రసారం చేయటం పరిపాటి. అయితే… లోక్ సభ, వివిధ శాసన సభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… రాజకీయపార్టీల ప్రకటనలకు సైతం స్టార్ ఇండియా గురిపెట్టింది.

అయితే…. 2018 నుంచి 2022 వరకూ హక్కుల కోసం ఐపీఎల్ బోర్డుతో స్టార్ ఇండియా కుదుర్చుకొన్న కాంట్రాక్టులో రాజకీయ, మతపరమైన ప్రకటనలకు చోటే లేదంటూ ఓ షరతు ఉండటం గమనార్హం.

ఇప్పుడు ఆ షరతును పక్కనపెట్టిన స్టార్ ఇండియా…. వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని ఎరగా చూపుతూ ఏకంగా బీసీసీఐ ముందే ఆ ప్రతిపాదన ఉంచింది. ఇదే విషయమై ఇప్పటికే స్టార్ ప్రతినిధులు బీసీసీఐతో రెండుసార్లు చర్చించినా ఏమాత్రం పురోగతిలేకుండా పోయింది.

రాజకీయ, మతపరమైన ప్రకటనలతో సొమ్ము చేసుకోవాలని చూస్తున్న స్టార్ ఇండియా ప్రతిపాదనను…ప్రభుత్వం ముందు ఉంచే సాహసం బీసీసీఐ చేస్తుందా? అన్నది అనుమానమే. అంతేకాదు… ప్రభుత్వం సైతం ఎంత వరకూ అనుమతిస్తుందన్నది కూడా సందేహమే.