తనను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా జగన్ ఎంపిక చేయడంపై నందిగం సురేష్ స్పందించారు. తాను చాలా చిన్నవాడినని… టికెట్ ఇవ్వాలని కూడా తాను జగన్‌ను అడగలేదన్నారు. కానీ తనకు టికెట్ ఇవ్వడం ద్వారా సామాన్యులకు, పేదలకు రాజకీయాల్లో అవకాశం ఉందన్న ఒక భరోసా ఇచ్చారన్నారు.

తన పేరు ప్రకటించిన తర్వాత రెండు వేల మంది ఫోన్లు చేశారని… అసలు సీటు నీకు ఎలా ఇచ్చారని అడుగుతున్నారన్నారు. ఖర్చుకు కూడా డబ్బులు లేని నీకు జగన్ ఎలా టికెట్ ఇచ్చారని అడుగుతున్నారన్నారు. టీడీపీవాళ్లు చేసిన తప్పుడు ప్రచారం నమ్మి చాలా మంది డబ్బున్న వారికే జగన్ టికెట్ ఇస్తారని భ్రమించారన్నారు.

జగన్ పాదయాత్ర చూసిన తర్వాత జగన్‌కు అంత ఓపిక ఎలా వచ్చిందని ఒక ఐఏఎస్ అధికారి స్వయంగా తనతో అన్నారన్నారు. ప్రజలకు ఏం కావాలో జగన్‌కు పూర్తిగా తెలుసన్నారు. ఒక పేద కుటుంబంలో పుట్టిన నన్ను ఎంపీగా ప్రకటించడమే కాకుండా, మిగిలిన ఎంపీల జాబితా కూడా తనతోనే ప్రకటించారని… ఈ జన్మకు ఇది చాలన్నారు. 

తాను చాలా చిన్న వాడినని … అతి సామాన్యుడినని అలాంటి తనకు ఎంపీ టికెట్ ఇవ్వడం బట్టే జగన్‌ ఏంటో అర్థమవుతోందన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ఈసారి ప్రజలు వైసీపీ వైపు నిలబడుతారన్నారు నందిగం సురేష్.