రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు పలువురి అనుమానితులను సిట్ బృందం అదుపులోనికి తీసుకొని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక అనుమానితుడు హత్య జరిగిన నాటి నుంచి పులివెందులలో లేనట్లు గుర్తించారు.

కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన పరమేశ్వరెడ్డి గత కొంత కాలంగా వివేకానందరెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఆయన వివేక హత్య జరిగిన నాటి నుంచి కనిపించకపోగా ప్రస్తుతం తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. దీంతో అతడిని ప్రశ్నించేందుకు తిరుపతి వెళ్లారు.

అయితే అంతకు మునుపే పరమేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య కుటుంబ సభ్యుల పనేనని ఆయన చెప్పుకొచ్చారు. తానకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో తొలుత కడపలోని సన్‌సైన్ ఆసుపత్రికి వచ్చానని.. తనకు చికిత్స చేసిన వైద్యుడు రాబోయే ముడు రోజులు అందుబాటులో ఉండను మీరు వెంటనే కర్నూలు వెళ్లమని సూచించారని పరమేశ్వరరెడ్డి చెప్పారు.

కాగా, తాను కర్నూలు వెళ్లకుండా తిరుపతి వచ్చానని… కనీసం కదల్లేని స్థితిలో మంచం మీద ఉన్న తనని కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. కుటుంబ సభ్యులను గట్టిగా ప్రశ్నిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని.. కాని పోలీసులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికికే తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు.