మాజీ మంత్రి, ఒకప్పుడు వైసీపీలో కీలకనేతగా ఉన్న కొణతాల రామకృష్ణ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. గత కొంత కాలంగా వైసీపీకి దూరంగా ఉన్న కొణతాల.. తీరా టికెట్లు ఇచ్చే సమయానికి జగన్‌ను కలిశారు. కాని వైసీపీ టికెట్ ఇచ్చే విషయంలో అప్పుడు ఆయనకు ఏ హామీ ఇవ్వలేదు. అంతే కాకుండా ఆదివారం ప్రకటించిన టికెట్ల లిస్టులో కొణతాల పేరు లేదు.

దీంతో కొణతాల ఇవాళ సీఎం చంద్రబాబును కలిశారు. ఇప్పటి వరకు టీడీపీ అసెంబ్లీ, లోక్‌సభకు పూర్తి అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో తనకు ఉత్తరాంధ్రలో ఏదో ఒక స్థానం నుంచి టికెట్ దక్కవచ్చనే ఆశతో చంద్రబాబును కలిశారు. అయితే కొణతాల విషయంలో చంద్రబాబు కనికరిస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. రెండ్రోజుల క్రితం వైసీపీని ఆశ్రయించి ఇప్పుడు టికెట్ కోసం టీడీపీ పంచన చేరడం పట్ల బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక గత కొన్నేండ్లుగా బాబు రాజకీయం గురించి తెల్సివాళ్లు మాత్రం కొణతాలకు బాబు టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు. గతంలో నామినేషన్లకు చివరి రోజు పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చిన చరిత్ర ఉందని.. ఇప్పుడు కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీ నేతలే పోటీకి జంకుతున్న వేళ.. పోటీ చేస్తానని ఎవరైనా వస్తే తప్పక టికెట్ ఇస్తారని అంటున్నారు. మరి కొణతాల విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.