అనంతపురం జిల్లా టీడీపీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గతంలో ఎప్పుడూ చూడని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఐదు సీట్ల పంచాయ‌తీ తేలలేదు. దీంతో టికెట్లు ఎవ‌రికి వ‌స్తాయ‌నే ఆందోళ‌న నేత‌ల్లో నెల‌కొంది.

సొంత పార్టీలోనే నిరసనలు, ఆందోళనలు, బెదిరింపులతో వాతావరణం వేడెక్కింది. సిట్టింగుల్లో చాలా మందిని మార్చకపోతే ఓటమి తప్పదని గతంలోనే చెప్పిన జేసీ ఇప్పుడు జిల్లాలో నలుగురు సిట్టింగులను మార్చాలని భీష్మించారు. అలా చేయని పక్షంలో తమ కుటుంబం ఎంపీ సీటును సైతం వదులుకునేందుకు సిద్ధమని చెప్పారు. దీంతో సీట్ల కేటాయింపు ద‌గ్గ‌ర పీట‌ముడి ప‌డింది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు ఓకే చెప్పిన చంద్రబాబు జేసీ చెప్పిన వారికి ఇచ్చేందుకు రెడీగా లేర‌ని తెలుస్తోంది.
జేసీకి వ్యతిరేకంగా జిల్లాలోని మిగిలిన నేతలంతా ఒక్కటయ్యారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ జేసీ చెప్పినట్లు సమాచారం. దీనికి తోడు జేసీ వర్గానికి చెందిన కార్పొరేటర్లు, ఇతర నేతలు అనంతపురం నుంచి అమరావతి వరకు నిరసనలు కొనసాగించారు.

అనంత‌పురం నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న మైనార్టీలు, బలిజలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని చౌదరికి టికెట్ ఇవ్వొద్దని.. ఒక వేళ ఇస్తే తాము రాజీనామా చేస్తామని హెచ్చరించారు. కొందరు చౌదరికి వ్యతిరేకంగా కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. బలిజ సామాజికవర్గానికి చెందిన మునిరత్నం అనంతపురం టికెట్ కోసం అమరావతిలో ఆందోళన చేశారు. అనంతపురం టికెట్ కోసం జరుగుతున్న రగడ అంతా ఇంతా కాదు.

ఇటు మిగ‌తా సీట్ల విష‌యంలో కూడా పంచాయ‌తీ న‌డుస్తోంది. క‌దిరి, సింగ‌న‌మ‌ల‌, క‌ల్యాణ‌దుర్గం, గుంత‌క‌ల్లు నియోజకవర్గాల ఆశావ‌హుల సంఖ్య పెరిగింది. దీంతో ఒక‌రికి సీటు వ‌స్తే మ‌రొక‌రు స‌హ‌క‌రించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. గ‌తంలో బీసీల‌కు ఎక్కువ సీట్లు ఇచ్చినా…. ఈసారి ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు జిల్లాలో ఉన్న ఇద్ద‌రు మంత్రులు త‌మ నియోజ‌క‌ వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. రాప్తాడు, రాయ‌దుర్గంలో ప‌రిటాల సునీత‌, కాల్వ‌ శ్రీనివాసులకు వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో త‌మ నియోజ‌క‌ వ‌ర్గాల‌ను స‌రిపెట్టుకునేందుకు వారు తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు.