.

ఇంటర్నేషనల్ కోర్టులో  భారత్ విజయం  - మరణశిక్షపై స్టే 

న్యూఢిల్లీ: కులభూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై స్టే ఇవ్వడం, భారత రాయబార కార్యాలయం అధికారులను కలుసుకునేందుకు జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించడంపై భారత్‌లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఇది మన దేశానికి లభించిన పెద్ద విజయం.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం తదితరులు ఐసీజే తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 
 
నిస్సందేహంగా ఇది భారత్‌ సాధించిన ఘనవిజయమని రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదే అభిప్రాయన్ని సుష్మాస్వరాజ్ వ్యక్తం చేశారు. జాదవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లిన ప్రధాని మోదీకి, వాదనలు వినిపించిన హరీష్ సాల్వేకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 'న్యాయం' అనే పదానికి నిజమైన అర్ధం ఐసీజే తీర్పు అని చిదంబరం అభివర్ణించారు. కేసుకు అనుకూలంగా 15 మంది జడ్జీలు, వ్యతిరేకంగా 1 జడ్జీ తీర్పు ఇవ్వడం అంటే ఏకగ్రీవంగా తీర్పువచ్చినట్టేనని ఆయన అన్నారు.