జగన్ ప్రభుత్వానికి భారీ కుదుపు   

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ భారీ షాకిచ్చింది. అమరావతి రాజధాని ప్రాజెక్ట్‌ నుంచి ప్రపంచబ్యాంక్‌ తప్పుకుంది. ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పిపిఏ)  మీద జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన 24 గంటల్లోనే ప్రపంచ బాంకు రాజధాని నిర్మాణానికి రూ.2,100 కోట్ల రుణాన్ని నిలిపివేసింది. ఏపీలో జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచబ్యాంక్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంక్‌ నిధులకోసం ప్రయత్నించగా, దానికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంక్‌కు రైతుల పేరిట మెయిల్స్‌ పంపించారు. ఈ మెయిల్స్‌ వెనుక వైసీపీ ఉందంటూ అప్పట్లో ప్రపంచబ్యాంక్‌కు తెలియ చేసింది. ఆ తరువాత ప్రపంచ బ్యాంక్ అమరావతికి వచ్చి రాజధాని నిర్మాణానికి క్లియరెన్స్‌ ఇచ్చింది. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం వైఖరి కారణంగానే ప్రపంచ బ్యాంక్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.  అలాగే సుమారు రూ.1,400 కోట్లు ఇచ్చేందుకు గతంలో ముందుకొచ్చిన ఆసియా బ్యాంక్‌ రుణం కూడా సందింగ్ధంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ చర్యలు అమరవాతి నిర్మాణాన్ని మరింత కష్టతరం చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.