శ్రీరంగ క్షేత్రం

తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి దేవాలయం 81 గుళ్ళతో , 21  గోపురాలతో, అద్భుత శిల్పకళా సౌందర్యంతో యాత్రీకుల మనస్సులను భక్తి భావంతో నింపే  155 ఎకరాల సువిశాల ప్రాంగణం. పరమ పవిత్ర శ్రీరంగ క్షేత్రంలో యోగనిద్రలో ఉన్నశ్రీమన్నారాయణ మూలమూర్తికి పెరియపెరుమాళ్ అని పేరు. ఉత్సవమూర్తి శ్రీరంగనాథుడు. వీరికి నంబెరుమాళ్ అని పేరు. అమ్మవారు శ్రీరంగనాయకి. ఉభయ కావేరీల మధ్య చంద్రపుష్కరిణి తీరంలో, ప్రణవాకార విమానంలో, సప్తప్రాకారాలతో, 15  గోపురాలతో, ఐదుతలల ఆదిశేషునిపై శయనించి భక్తులకు కనువిందు చేస్తున్నశ్రీరంగనాథునికి కొలువైన పుణ్య క్షేత్రం.    

 కావేరియే విరజానదిగా, శ్రీరంగమే శ్రీవైకుంఠముగా, శ్రీరంగనాధుడే శ్రీమహావిష్ణువుగా ఖ్యాతి పొందింది.
ఈ క్షేత్రంలో, శ్రీమహావిష్ణువు  వ్యూహవాసుదేవమూర్తిగా శయనించి వుంటారు. విభవతారాలకు మూలమైన  ఈ వ్యూహవాసుదేవమూర్తి నుండే శ్రీరామ, శ్రీకృష్ణాదులు అవతరించారు. అలాగే అర్చావతారాలకు మూలం కూడా శ్రీరంగనాధుడే. అర్చావతారం అంటే విగ్రహరూపం.  ఏ ఆలయంలోగాని, గృహంలోగాని ఎవరైనా విష్ణుమూర్తి విగ్రహాన్నిప్రతిష్ఠిస్తే , ఆ విగ్రంలోనికి భగవత్ శక్తి , శ్రీరంగనాధునినుండే వస్తుంది.  శ్రీరంగనాధ క్షేత్రం సురక్షితంగా ఉంటే, విగ్రహాలున్న దేవాలయాలన్నీ సురక్షితంగా, ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా ఉంటాయి. 

 భగవానుడు  తానుగా వరించి, అవతరించిన పుణ్యక్షేత్రాలు ఎనిమిది. అవి శ్రీరంగం, తిరుమల, శ్రీముష్ణం, తిరునీర్మలై, నైమిశారణ్యం, పుష్కరం మరియు బదరికాశ్రమం. వీటిలో  మొదటిది శ్రీరంగం.  
ఆళ్వారులు ప్రస్తుతించిన 108 దివ్యక్షేత్రాలలో ప్రధానమైనది శ్రీరంగ క్షేత్రం. శ్రీమద్రామానుజాచార్యులు నివసించి, గద్యత్రయమును శ్రీరంగనాథునకు సమర్పించిన పుణ్య  క్షేత్రం.   

 కృతయుగంలో శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించాడు. ఆ చతుర్ముఖుడు ఆరాధించుకోవటానికి  విగ్రహమునిమ్మని ప్రార్ధించగా  , శ్రీహరి ఆదిశేషునిపై శయనించిన శ్రీరంగనాథుని విగ్రహాన్నిశ్రీరంగ విమానంతో  బ్రహ్మకు బహూకిరించాడు. అప్పటినుంచి బ్రహ్మ భక్తి శ్రద్ధలతో శ్రీరంగనాథుని ఆరాధిస్తూ ఉండేవాడు. మనువు కుమారుడు, బ్రహ్మ మనుమడైన ఇక్ష్వాకుడు  శ్రీరంగవిమానం సంపాదించాలనే కోరికతో బ్రహ్మకై ఘోర తపస్సు చేసాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే తన కోరిక తెలియచేసాడు. ఇంతలో శ్రీహరి ప్రత్యక్షమై ఇక్ష్వాకునికి  శ్రీరంగం విమానం ఇవ్వమంటే, బ్రహ్మ తాను శ్రీరంగం విడచి ఉండలేనని అనగా, శ్రీమన్నారాయణుడు తాను అయోధ్యలో ఉన్నంతకాలం ప్రతిదినం ఉదయాన్నేతనని ఆరాధించమని, శ్రీరంగంలోనైతే మధ్యాహ్నం ఆరాధించమని తాను ఆ ఆరాధనని స్వీకరిస్తానని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ ఒప్పుకొని శ్రీరంగ విమానంతో సహా శ్రీరంగని అర్చామూర్తిని ఇక్ష్వాకునకు ప్రసాదించాడు. ఆలా  భూలోకంలో శ్రీరంగనాథుడు, శ్రీరామచంద్రుని వరకు సూర్యవంశపు 
రాజుల పూజలను స్వీకరించాడు. పట్టాభిషేక సందర్భముగా తనని విడచి వెళ్లలేని విభీషణునకు తన గుర్తుగా తన ఆరాధ్యమైన శ్రీరంగవిమానాని  బహూకరించాడు. శ్రీరంగ విమానంతో లంకకు బయల్దేరిన విభీషణుడు కావేరి తీరంలో శ్రీరంగని ఉంచి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంతలో అక్కడికి వచ్చిన  ధర్మ వర్మ 
అనే   రాజు, శ్రీరంగనాథుని అక్కడే కొలువై ఉండమని ప్రార్ధించాడు. భక్తసులభుడైన శ్రీరంగనాథుడు అక్కడే సుప్రతిష్ఠుడయ్యాడు. అంతలో విభీషణుడు వచ్చి జరిగినది చూచి దుఃఖించాడు. అతని వేదనను గమనించిన స్వామి  విభీషణునికి ప్రతి రాత్రి వచ్చి ఆరాధన చేసుకోమని చెప్పాడు. అలాగే నేటికీ ప్రతి రాత్రి, విభీషణుడు వచ్చి రంగనాథుని ఆరాధిస్తుంటాడు.
 
    పరమపవిత్రమైన తిరుప్పావై రచించి, తాను ధరించిన మాలను స్వామికర్పించి, వరించి, 
శ్రీరంగనాథుని భర్తగా పొంది, స్వామిలో ఐక్యమైన లక్ష్మీదేవి అవతారమైన గోదాదేవి నిలయం శ్రీరంగం. 

     ఏడు ఉర్ధ్వలోకాలకు సంకేతమైన ఏడు ప్రాకారాలతో శోభిల్లే పుణ్య క్షేత్రం శ్రీరంగం.  మొదటి ప్రాకారంలోని గర్భగృహంలో స్వామివారు శయనించి ఉంటారు. ఇది సత్యలోకానికి సంకేతం.  రెండవ ప్రాకారం  కిందనే, శ్రీ వైకుంఠంలో ప్రవహించే విరజానది,ప్రవహిస్తుందంటారు. మూడవ  ప్రకారంలో  నమ్మాళ్వార్ సన్నిధి  వున్నది. నాల్గవ ప్రాకారంలో  
శ్రీరంగనాచియర్ సన్నిధి, శరణాగతి మండపం, శ్రీ రామానుజులవారి సన్నిధి కూడా  ఉన్నవి.  ఐదవ  ప్రాకారంలోని  వీధులలో, చైత్రమాసంలో తప్ప మిగతా అన్ని బ్రహ్మోత్సవాలలోను శ్రీ రంగనాథుని  ఊరేగిస్తారు.  ఆరవ  ప్రాకారంలోని  వీధుల్లో
చైత్రమాసంలో  జరిగే బ్రహ్మోత్సవాల్లో  స్వామిని  ఉరేగిస్తారు. ఏడవ   ప్రాకారంలో   వెళియా‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ండాల్    సన్నిధి ఉన్నది.
గర్భాలయంలో శయన మూర్తయిన పెరియపెరుమాళ్ మరియు ఉత్సవమూర్తయిన నంబెరుమాళ్ తో  పాటు 'తిరువరంగమాళిగైయార్మూర్తి'  కూడా కొలువై వుంటారు. ఈ గర్భాలయంలో రెండు స్తంభాలున్నాయి . కనువిందైన  శ్రీరంగనాథుని సౌందర్య ప్రవాహంలో పడి  కొట్టుకు పోకుండా పట్టుకోవడానికి ఉన్నస్తంభాలుగా అవి ప్రసిద్ధి చెందాయి. గర్భాలయమునకు పైన ప్రాణవాకార విమానమున్నది. ఈ విమానం మీద 12 శిఖరాలున్నాయి. ఈ విమానం మీద శ్రీమహావిష్ణువు కొలువై  వుంటారు. అయన  మనకి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మనకోసం ఎదురు చూసి చూసి , ఒకవేళ  రాకపోతే  'ఇకవీడు రాడు'  అని మన పేరు తీసేస్తారట 
     ఇక్కడ ఆచార్యులైన 'రమ్యజామాతృముని' అనికూడా పిలువబడే  ' మణవాళ‌ మహాముని' ,  దగ్గర శ్రీరంగనాథుడు ముచ్చటపడి, ఒక సంవత్సరం పాటు 'తిరువాయిమొళి' ప్రబంధ వ్యాఖ్యానాన్ని విన్నారు. శ్రీ రంగనాథుని దర్శనం మోక్షదాయకం.  

ఈ  క్షేత్రం తమిళనాడులో, చెన్నైకి 332  కి.మీ. దూరంలో ఉన్న తిరుచ్చి పట్టణంలో ఉంది. తిరుచ్చి  పట్టణానికి   రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ సదుపాయాలు కూడా   ఉన్నాయి.