అమరావతి: ‘అక్రమ’ కట్టడాలు, కూల్చివేతలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి జగన్‌, విపక్ష నేత చంద్రబాబు ఎవరికివారు కోర్టు తీర్పులు, అధికారిక ఉత్తర్వులను చూపిస్తూ తమ వాదనలు వినిపించారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలోనే ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. నదులు, కాల్వల గట్ల వద్ద ఉన్న అక్రమ కట్టడాలపై ప్రభుత్వం తన విధానం తెలపాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కోరారు. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కట్టడాలు 72వేలు ఉన్నట్లు గుర్తించామని... వీటిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో సభలో దుమారం రేగింది. జగన్‌ సర్కారు కూల్చివేసిన ‘ప్రజావేదిక’తోపాటు, చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘కేవలం మాకు కేటాయించాలని అడిగినందుకే ప్రజావేదికను కూల్చేశారు. ఇలాగే తమ ఇళ్లను కూడా కూల్చేస్తారని 72 వేల గృహాలలో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి’’ అని సూచించారు. తాను ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తనది కాదని... లింగమనేని రమేశ్‌ అనే వ్యక్తి దగ్గర అద్దెకు తీసుకున్నానని చెప్పారు. ప్రజావేదిక కూడా తన నివాసం కాదని, ప్రభుత్వానిదని గుర్తుచేశారు. ‘‘భవనాల కూల్చివేత పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. దౌర్జన్యాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దు. అవసరమైతే రోడ్డుపై పడుకుంటా తప్ప ఎవరి బెదిరింపులకూ లొంగను’’ అని తెలిపారు. ప్రజా వేదికకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పారు. అక్రమ కట్టడాలైనప్పటికీ... వాటిని ప్రభుత్వ అవసరాలకోసం వాడుకోవచ్చునని 2015లో మార్చి 7వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కట్టిన భవనాలను కూడా రెగ్యులరైజ్‌ చేసే అధికారం ఉంటుందని కూడా సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ‘‘నన్ను తిట్టినా, అవమానించినా పడతాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నిపాట్లు పడడానికైనా నేను సిద్ధం. రోడ్డు మీద పడుకోవడానికైనా వెనుకాడబోను’’ అని స్పష్టం చేశారు.అక్రమంగా వేలాది వైఎస్‌ విగ్రహాలు ఉన్నాయి.  వాటిని కూడా తొలగిస్తారా? అని ఘాటుగా ప్రశ్నించారు.