బెంగళూరు: కర్ణాటక విధాన సభలో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సాయంత్రం 6గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్‌ గడువు విధించిన నేపథ్యంలో కర్ణాటక  రాజకీయ పరిణామాలు క్క్షణం క్క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'కర్ణాటకం'  మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. విప్‌పై స్పష్టత కోరుతూ కేపీపీసీ అధ్యక్షుడు దినేష్‌ గుండూరావు సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టిన  కొద్దిసేపటికే.. సీఎం కుమారస్వామి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విప్‌పై స్పష్టతతో పాటు శాసనసభ వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యంపైనా ముఖ్యమంత్రి పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో బలపరీక్షపై చర్చ జరుగుతోందని.. ఇంతలోనే బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ జోక్యం చేసుకుంటున్నారని.. అది అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌కు కూడా విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. శాసనసభ వ్యవహారాల్లో గవర్నర్‌కు పరిమితమైన అధికారాలే ఉంటాయని.. గవర్నర్‌ సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే వీలు లేదంటూ ఆయన వివరించారు. 
     

    ఒక వైపు  15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో పడిన కర్ణాటక ప్రభుత్వం,  ఇంకొక వైపు  గవర్నర్ వరుస లేఖలతో మరింత ఇబ్బందికర పరిస్థితులను  ఎదుర్కొంటుంది.   
ఎంత ప్రయత్నించినా ఇప్పటికి కూడా రాజీనామాలు చేసిన  ఎమ్మెల్యేలు, వరుస వీడియోలు విడుదల చేస్తూ వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేస్తున్నారు. ఎలాగైనా మెజారిటీ నిరూపించుకోవాలని అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్,జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తమ వద్దనున్న అన్ని ఆయుధాలను వాడుతోంది.  మరింత సమయం సంపాదించడం కోసం  అవిశ్వాస తీర్మానంపై చర్చను సాగదీస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చర్చ పూర్తయితే గానీ బలపరీక్ష నిర్వహించే అవకాశం లేదు.  ఈ తీర్మానంపై చర్చ ముగియాలంటే మరో 2, 3 రోజులు పట్టే అవకాశం ఉంది. నేపథ్యంలో కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.