అమరావతి: వైకాపా ఒంటెద్దు పోకడల పాలన వల్ల  పొరుగు రాష్ట్రాలకు లాభం, ఆంధ్రకు  నష్టంగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిధుల మంజూరుకు ప్రపంచబ్యాంకు వెనుకంజ వేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. ఇవాళ్టి శాసనసభ సమావేశాల్లో రోడ్ల నిర్మాణం, ఇతర పనుల నిలిపివేతపై చర్చకు పట్టుబట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. వివిధ ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోవడంపై చర్చకు పట్టుపడదామన్నారు. పార్టీ వ్యూహ కమిటీతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైకాపా దౌర్జన్యాల వల్ల పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని, యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, అమరావతి పనులు పూర్తిగా పడకేశాయన్నారు. ఆగిన పనులను ప్రారంభించే సామర్థ్యం వైకాపాలో కొరవడిందని ఆరోపించారు.

 రాజధాని నగరం అమరావతిలో పనుల నిలిపివేతపై శాసన సభలో నేడు వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు.  వైకాపా నేతల చేతగానితనంతో రాష్ట్రానికి తీవ్రనష్టం చేస్తున్నారని విమర్శించారు.  పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం పేట్రేగాయని, దాడులు, దౌర్జన్యాలతో శాంతిభద్రతలను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శాంతిభద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు రావని, యువత ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని చెప్పారు. ఇది ఒకరోజు పోరాటం కాదు, ప్రతిరోజూ ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు సూచించారు.