హైదరాబాద్‌: అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు  ఇవ్వకుండానే కూల్చివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. నూతన పురపాలక చట్టం-2019  గురించి వివరిస్తూ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించిన సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వాలని అన్నారు. తప్పుడు సర్టిఫికేషన్‌ ఇస్తే 25 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. కొత్త చట్టంలో జిల్లా కలెక్టర్లు మరింత కీలకం కానున్నారని, పని చేయని సర్పంచ్‌లు, ఛైర్‌పర్సన్లు, వార్డుమెంబర్లు, కౌన్సిలర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందం ఇళ్లకు సంబంధించిన కొలతలు చేపడుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్‌ తీసుకున్న చర్యలపై స్టే ఇచ్చే అధికారాన్ని మంత్రి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. 500 చదరపు గజాల వరకు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతి వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానిది  ‘సిటిజన్‌ ఫ్రెండ్లీ ఆర్బన్‌ పాలసీ’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

కొత్త పురపాలక చట్టంలో ప్రతివాక్యం తానే రాయించానన్న కేసీఆర్‌.. ఈ చట్టం కొందరికి నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరిపాలన విధానంలో మెనాటనీ వచ్చిందని, ముఖ్యమంత్రి, స్పీకర్‌కు లేని అధికారాలు వీఆర్వోలకు ఉన్నాయని అన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులను ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలే చేసే అధికారం వస్తుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొత్త డోర్‌ నంబర్లు ఇస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి డోర్‌ నంబర్‌ కచ్చితంగా ఉండాలని కేసీఆర్‌ శాసనసభలో వెల్లడించారు.రానున్న మూడేళ్లలో అద్భుతం జరగుతుందని తాను ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.