మొదటినుంచి తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజ‌న్ పై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ జ‌రుగుతుంద‌ని, స‌భ్యుల‌ను ఇబ్బందులు పెడుతున్నారంటూ, శ్వేతా రెడ్డి, గాయ‌త్రి గుప్తా వంటి న‌టీమ‌ణులు కోర్టులో కేసులు కూడా వేశారు. అదే స‌మయంలో బిగ్‌బాస్ షోను ర‌ద్దు చేయాల‌ని ఉస్మానియా విద్యార్థులు హెచ్చ‌రించారు. అంతే కాకుండా మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే బిగ్‌బాస్ సీజ‌న్ 3 జూలై 21 నుండి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఉస్మానియా విద్యార్థులు బిగ్‌బాస్ షోను ఆపాల‌ని చెప్పారు. లేకుంటే షో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న నాగార్జున ఇంటిని  ముట్ట‌డించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగా  రియాల్టీ షో బిగ్‌బాస్‌-3ని నిలిపివేయాలంటూ ఓయూ ఐకాస విద్యార్థులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటిని ముట్టడించారు. బిగ్‌బాస్‌- 3 వివాదంపై ఇద్దరు మహిళలు ఒంటరి పోరాటం చేస్తుంటే, నాగార్జున కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. మహిళలను కించపరిచే షో కి నాగార్జున ఏ రకంగా వ్యాఖ్యాతగా ఉంటారని ప్రశ్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 8 మందిని అరెస్టు చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.