దిల్లీ: భారత దేశంలో అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీ వరుసగా పదకొండో ఏడాది తన వార్షిక  వేతనాన్ని రూ. 15కోట్లకు పరిమితం చేసుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ హోదాలో 2008-09 నుంచి ముకేశ్‌ ఇంతే జీతం తీసుకుంటున్నారు. దాదాపు ఏటా రూ. 24కోట్లను తృణప్రాయంగా వదులుకుంటున్నారు. కంపెనీలో శాశ్వత డైరెక్టర్లందరి జీతాలు పెరుగుతున్నా ముకేశ్‌ మాత్రం తన వేతనాన్ని పెంచుకునేందుకు ఇష్టపడట్లేదు. 

   ‘ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ కోరిక మేరకు ఈ ఏడాది కూడా ఆయన వేతనాన్ని రూ. 15కోట్లుగా నిర్ణయించాం. యాజమాన్య వేతన స్థాయిలు తక్కువగా ఉండాలని చెప్పడానికి ముకేశ్‌ వ్యక్తిగత ఉదాహరణగా నిలిచారు’ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2018-19లోనూ ముకేశ్  జీతం ఇదే.   2018-19లో ముకేశ్‌ రూ. 4.45కోట్లు జీతంగా అందుకున్నారు. ఇక కమిషన్ కింద రూ. 9.53కోట్లు, ఇతర భత్యాలు రూ. 31లక్షలు, పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ. 71లక్షలు తీసుకున్నారు.  సీఈఓల వేతన పరిమాణాలపై చర్చ నేపథ్యంలో అక్టోబరు 2009న అంబానీ తన వేతనాన్ని స్వచ్ఛందంగా రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఇతర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల వేతనాలు పెరిగినప్పటికీ.. ఈయన మాత్రం ఆ మొత్తానికే కట్టుబడి ఉన్నారు. వాటా దారులను ముంచి తాము అందలమెక్కే కంపెనీల అధిపతులు ఎక్కువగా ఉండే ఈ కాలంలో  తమ వాటాదారుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమిచ్చే ముఖేష్ లాంటి యజమాన్యం ఆదర్శప్రాయం.