న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మృతి ఆమె అభిమానులనే కాకుండా  ఢిల్లీవాసులందరిని  విషాదంలో ముంచెత్తింది. పార్టీలకు అతీతంగా సంతాప సందేశాలు వెల్లువెత్తున్నాయి. 81 ఏళ్ల షీలాదీక్షిత్ ఇవాళ మధ్యాహ్నం 3.55 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. గుండె వ్యాధితో  గత వారం ఫోర్టీస్  ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన షీలాదీక్షిత్‌కు  వైద్యుల బృందం చికిత్స అందజేసింది. పరిస్థితి నిలకడగా ఉన్న దశలో ఇవాళ మధ్యాహ్నం మరోసారి గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
 
ఆమె భౌతిక కాయాన్ని కొద్దిసేపటి క్రితం నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి తరలించారు. ఆమె పార్థివ దేహాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రజాసందర్శనార్థం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంచి, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్‌బోధ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. షీలాదీక్షిత్ మృతితో ఢిల్లీ ప్రభుత్వం 2 రోజులు సంతాపదినాలు ప్రకటించింది.