నెల్లూరు: నెల్లూరు జిల్లాలో  వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ పై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తిర్గబడ్డారు. నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్టణంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  దానికి కొనసాగింపుగా ఆయన పాల్గొన్న  తోళ్ల పరిశ్రమపై ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. తోళ్ల పరిశ్రమ తమ కొద్దంటూ స్థానికులు నినాదాలు చేశారు. గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు విసిరి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎనిమిదేళ్లుగా తోళ్ల పరిశ్రమను తీరప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో భారీ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
 
తోళ్ల పరిశ్రమ వ్యతిరేక ఉద్యమ నేత శ్యాంప్రసాద్ రెడ్డితో కలిసి గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, అప్పటి ఎంపీ వరప్రసాద్ తోళ్ల పరిశ్రమను వ్యతిరేకిస్తూ ప్రజల వైపు నిలబడ్డారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రజల వైపు నిలబడకుండా పరిశ్రమ ప్రతినిధులకు అండగా నిలిచారు. దీంతో వరప్రసాద్ తీరుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు తిరగబడ్డారు. పరిశ్రమ ప్రతినిధులకు ఎమ్మెల్యే అమ్ముడు పోయారని స్టేజిపైకి వెళ్లి  ఆగ్రహం వ్యక్తం చేయడంతో  వరప్రసాద్‌, పరిశ్రమ ప్రతినిధులు వెనుతిరగవలసి  వచ్చింది.