చిత్తూర్  : శనివారం ఆయన వి.కోట మండలంలోని కె.నక్కనపల్లెలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలున్న పార్టీ బీజేపీ అని, ప్రధాని మోదీ పాలనను మెచ్చే ప్రజలు తిరిగి ఆయనకు అధికారం కట్టబెట్టారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  గత ఏడాది 11 కోట్ల బీజేపీ సభ్యత్వం తీసుకోగా, ఈ ఏడాది 20 కోట్ల సభ్యత్వాలను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారత్‌ను శక్తి వంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు, వెనుకబడిన వర్గాలకు చట్టబద్దత, త్రిపుల్‌ తలాఖ్‌ బిల్లు, అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు.
 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకు పోయిందన్నారు. టీడీపీ కోలుకునే పరిస్థితి లేదన్నారు. అధికారంలోని వైసీపీకి అదే గతి పడుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వయస్సు అయిపోయిందని, లోకేష్‌కు వాయిస్‌ లేదని దీంతో టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందన్నారు. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌ మాట్లాడుతూ... గ్రామ స్థాయిలో నాయకులు,కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఆయన సమక్షంలో కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌, టీడీపీ ఇతర పార్టీల ప్రముఖులు బీజేపీలోకి రాగా వారికి కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. కాగా, పొరుగునున్న కర్ణాటకలో కుమార స్వామి సంకీర్ణ సర్కారు వెంటిలేటర్‌పై నడుస్తోందని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ఈ రోజో, రేపో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని జోస్యం చెప్పారు.