విజయవాడ:  మానవత్వాన్ని మంటకలిపి, వావి వరసలు మరిచి, అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. జగ్గయ్యపేటకు చెందిన బాధితురాలు కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఉంటున్న పెద్ద కుమార్తెను చూసేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లింది. తిరుగు ప్రయాణమవుతుండగా అల్లుడు తాను జగ్గయ్యపేట వైపు వస్తున్నానని, కారులో వెళదామని చెప్పాడు. అత్తను కారులో ఎక్కించుకుని భీమవరం పరిధిలోని టోల్‌ ప్లాజా సమీపంలో గల డొంక రోడ్డుకు కారును తిప్పాడు. ఇటు ఎక్కడికి అని అడుగుతుండగా టోల్‌ ఫీజు చెల్లించకుండా ఇటు వెళదామని చెప్పి కొంత దూరం తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తెలిపింది. తనకు కుమారుడి లాంటి వాడివని ఎంత వేడుకున్నా
కనికరించలేదని చెప్పింది.తరువాత తనను కారులో ఎక్కించుకుని జగ్గయ్యపేటలో తన ఇంటి సమీపంలో దించి పరారైనట్లు తెలిపింది. ఇంటికి వెళ్లి భర్తతో చెప్పి మరొక కారులో కీసర వెళ్లి అల్లుడిని నిలదీసేందుకు ప్రయత్నిస్తే తమపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని చెప్పింది. ఈ సంఘటనపై వత్సవాయి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.