కరీంనగర్: ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఎదుట కరీంనగర్‌ జిల్లా చింతకుంటకు చెందిన భూక్యా భాగ్యమ్మ(50) ఆదివారం  ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చింతకుంటలో ఆసరా లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేసి వెళుతున్న సమయంలో అక్కడే ఉన్న భాగ్యమ్మ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొంది. టీఆర్‌ఎస్‌ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. తనకు ఇంటి నెంబర్‌ కేటాయించేందుకు సర్పంచ్‌, కార్యదర్శి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని భాగ్యమ్మ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసింది. సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం భాగ్యమ్మ విలేకరులతో మాట్లాడారు. 2007 నుంచి ఇంటి నెంబరు కోసం ప్రయత్నిస్తే రూ.3 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా కంటే ఎక్కువగా ఆక్రమించుకున్నందునే ఇంటినంబర్‌ ఇవ్వలేదని కార్యదర్శి తెలిపారు.