చెన్నై: తమిళనాడు చలనచిత్ర దర్శకుల సంఘం అద్యక్షుడిగా ప్రముఖ దర్శకుడు ఆర్‌కే సెల్వమణి భారీ మెజార్టీతో మరోసారి ఎంపికయ్యారు.  ఇంతవరకు అధ్యక్షుడిగా వున్న విక్రమన్‌ పదవీకాలం ఈ నెలాఖరులతో ముగియనుండడంతో కొత్త కార్యవర్గ సభ్యుల ఎంపికకు సంబంధించి ఎన్నికలు నిర్వహించారు. గత నెలలో జరిగిన దర్శకుల సంఘం కార్యవర్గ సమావేశంలో ప్రముఖ దర్శకుడు  భారతీరాజాను అద్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ఆయన మీద విమర్శలు వెల్లువెట్టడంతో భారతిరాజా ఆ పదవికి రాజేనామా చేశారు. 
 
 ఆయన రాజీనామాతో దర్శకుల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు. అధ్యక్ష పదవికి ఆర్‌కే సెల్వమణి, విద్యాసాగర్‌ పోటీచేయగా, ఉపాధ్యక్ష పదవికి కేఎస్‌ రవికుమార్‌, మురుగన్‌, రవిమరియాలు పోటీకి దిగారు. డిప్యూటీ కార్యదర్శి పదవికి లింగుస్వామి, సుందర్‌.సి తదితర ఆరుగురు పోటీ చేశారు. కార్యవర్గ సభ్యులుగా మనోబాల, రాంకీ, రమేష్‌కన్నాతో పాటు 30 మంది పోటీ చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఆర్వీ ఉదయ కుమార్‌, కోశాధికారిగా పేరరసులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
 
ఈ నేపథ్యంలో, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలతో ముగిసింది. అనంతరం ఎన్నికల అధికారి సెంథిల్‌నాథన్‌ సమక్షంలో ఓట్ల లెక్కింపు జరిగింది. దర్శకుల సంఘంలో మొత్తం 2,700 మంది సభ్యులుండగా 1,508 ఓట్లు పోలయ్యా యి. అందులో ఆర్‌కే సెల్వమణికి 1,386 ఓట్లు రాగా ఆయన పై పోటీచేసిన విద్యాసాగర్‌కు కేవలం 100 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అలాగే, ఉపాధ్యక్ష పదవికి పోటీచేసిన కేఎస్‌ రవికుమార్‌ 1,489 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఆర్‌కే సెల్వమణి మరోసారి గెలుపొందారు.