రిమ్స్‌ వైద్యశాలకు తరలించిన పోలీసులు
ఒంగోలు: చీరాల మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ అనుచరుల నుంచి తనను, తన కుటుంబాన్ని, ఆస్తులను రక్షించాలని కోరుతూ చీరాల మండలం పుల్లరిపాలెం తాజా మాజీ ఎంపీటీసీ సభ్యుడు కోడూరి వెంకటేశ్వర్లు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఒంగోలులో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో తన సమస్యను కలెక్టర్‌ పోలా భాస్కర్‌కు చెప్పుకోనేందుకు వచ్చారు. ఆమంచి కృష్ణమోహన్‌ అనుచరులు చేస్తున్న అగడాలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడంతో ఆ ఆర్జీని జిల్లా ఎస్పీకి సిఫార్సు కూడా చేశారు. అయితే స్పందన కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు తనతో పాటు తెచ్చుకున్న పురుగులమందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంకటేశ్వర్లును హుటాహుటినా రిమ్స్‌కు తరలించారు. బాధితుడు కలెక్టర్‌ అందించిన వినతిప్రతంలో వివరాలు ఇలా ఉన్నాయి.
 
తాను గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారుల వద్దకు తీసుకెళ్ళి పరిష్కారం కోసం పాటుపడ్డానని, వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ సహకారంతో ఇంటిని నిర్మించుకొని జీవనం సాగిస్తున్నానని,   వ్యవసాయం కోసం ప్రభుత్వం నుంచి నాలుగు ఎకరాల భూమిని పొందానని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, పట్టాదారుపాసుపుస్తకాలు కూడా ఉన్నాయన్నారు. ప్రస్తుతం వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని, ఆ పార్టీ నుంచి పుల్లరిపాలెం ఎంపీటీసీగా పనిచేశారని తెలిపారు. ఈనెల 13న ఆమంచి కృష్ణమోహన్‌ అనుచరులు వాయుల పోలయ్య, కోడూరి అంజయ్య, తూపిలి శ్రీరాములు  నీవు దుర్మార్గుడివి  నీ భూమి, ఇంటిని తాము లాగేసుకుంటున్నామని, మీరు ఊర్లో ఉండటానికి లేదని, ఇంటికి తాళం వేస్తామని బెదిరించారని ఆ పత్రంలో  పేర్కొన్నారు.
 
తాను అక్కడి నుంచి ప్రాణభయంతో చీరాలలో స్నేహితుడి ఇంటి వద్ద తలదాచుకొని ఈనెల 15న వేటపాలెం పోలీ్‌సస్టేషన్‌కు వెళ్ళి నా కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాలని ఎస్‌ఐకి ఫిర్యాదు చేశానని తెలిపారు. అయితే తనపై దౌర్జన్యం చేసిన వ్యక్తులను ఎస్‌ఐ పిలిపించి మాట్లాడుతున్న సమయంతో ఆమంచి కృష్ణమోహన్‌ చేత ఎస్‌ఐతో మాట్లాడించడంతో తనను పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిపోవాలని చెప్పారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రాణభయంతో ఎస్పీని కలిసేందుకు మంగళవారం వచ్చానని అందుబాటులో లేకపోవడంతో బుధవారం కలిసి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరానన్నారు. అదే రోజు వాయిల పోలయ్య, కోడూరి అంజయ్య, తూపిలి శ్రీరాములు కలిసి గ్రామంలో గ్రామకాపులకు, గ్రామస్థులను రెచ్చగొట్టి మా ఇంటికిపైకి పంపించి మూకుమ్మడిగా దాడి చేయడంతో తన భార్య మంగమ్మ కుడిచేయి వేలు ఎముక కూడా విరిగిపోయిందన్నారు. ఇంట్లో ఉన్నవారందరికి బయటకు ఈడ్చిఇంటికి తాళం వేసి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని ఊర్లోకి వస్తే చంపేస్తామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. వారి బారి నుంచి రక్షణ కల్పించాలని లేనిపక్షంలో తమ కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడటం తప్ప మాకు మరో మార్గంలేదని కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.