అమరావతి: శాసనసభలో తెదేపా శాసనసభాపక్ష ఉపనేతల సస్పెన్షన్‌పై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఘాటుగా స్పండిచారు.  ప్రజల పక్షాన నిలిచిన నాయకులకు రాజన్న రాజ్యంలో పరిస్థితి ఇదీ! అంటూ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని మార్షల్స్‌ తీసుకెళ్తున్న ఫొటోను పోస్ట్‌ చేశారు.

ఇవాళ ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా ఎన్నికల హామీపై స్పష్టతకు తెదేపా సభ్యుడు రామానాయుడు డిమాండ్‌ చేశారు. అయితే మేనిఫెస్టోలో అలాంటి హామీ ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో తాను మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. 

దీనిపై స్పందించిన తెదేపా సభ్యులు తమ వద్ద ఉన్న వీడియోను ప్రదర్శించేందుకు అనుమతి కోరారు. దీనికి ప్రభుత్వం నిరాకరించడంతో స్పీకర్‌ తదుపరి ప్రశ్నకు వెళ్లారు. దీంతో తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఆగ్రహించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ఈ సమావేశాలు ముగిసేవరకు తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న ఉపసభాపతి కోన రఘుపతి దీనిని ఆమోదించారు. అయినప్పటికీ తెదేపా సభ్యులు సభను వీడలేదు. అక్కడే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రామానాయుడుని మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసుకెళ్లిపోయారు.