దుబాయ్‌:  కొత్త సీజన్‌లో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించబోతోంది. ఇంగ్లాండ్‌, ఆసీస్‌ యాషెస్‌ సమరానికి సిద్ధమవుతున్నాయి. బంగ్లాదేశ్‌ శ్రీలంకకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజా టెస్టు ర్యాంకులను ప్రకటించింది.

తన నంబర్ 1 స్థానాన్ని పదిల పరుచుకున్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ 922 పాయింట్లతో బ్యాటింగ్‌ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. కివీస్‌ సారథి కేన్‌విలియమ్సన్‌ (913) అతడి వెనకే నిలిచాడు. వీరిద్దరి మధ్య అంతరం కేవలం 9 పాయింట్లే కావడం గమనార్హం. భారత నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారా (881) మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం నాలుగులో ఉన్న స్టీవ్‌స్మిత్‌ (857) తన తొలి ర్యాంకు కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. నిషేధం తర్వాత మళ్ళీ  జట్టులో చేరిన అతడు మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. 

బౌలర్ల జాబితాలో భారత్‌ నుంచి రవీంద్ర జడేజా (6వ ర్యాంకు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (10) మాత్రమే టాప్‌ 10లో ఉన్నారు. ప్యాట్‌ కమిన్స్‌, జిమ్మీ అండర్సన్‌, కాగిసో రబాడ వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. జేసన్‌ హోల్డర్‌, షకిబ్‌ అల్‌ హసన్‌ తర్వాత జడ్డూ మూడో స్థానంలో ఉన్నాడు. భారత జట్టు యథావిధిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.