భోపాల్: గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, బి‌జే‌పి పెద్దలు మధ్యప్రదేశ్ కాంగ్రెస్సు సర్కార్ మీద కూడా గురి పెట్టినట్టు అర్ధమవుతుంది. అయితే, మొదట కర్ణాటకాన్ని సాధించిన తరువాత మధ్యప్రదేశ్ కైవసం చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బి‌జే‌పి మధ్యప్రదేశ్ మీద దృష్టి పెట్టింది.  దీనికి సమాధానంగా మధ్యప్రదేశ్ మంత్రి, కాంగ్రెస్ నేత జీతూ పట్వారీ విశ్వాసపరీక్షలో కర్ణాటక ప్రభుత్వం కుప్పకూలిన అనంతరం పట్వారీ మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక లాగానే ఇక్కడ కూడా తమ సర్కార్‌కు ఎన్నివిధాల చిక్కులు కల్పించాలో అన్ని రకాలుగా బీజేపీ చిక్కులు కల్పిస్తూనే ఉంటుందని, అయితే ఇక్కడున్నది కమల్‌నాథ్ ప్రభుత్వమని, కుమారస్వామి ప్రభుత్వం కాదని ఆయన అన్నారు.

    కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోసిపుచ్చారు. 'ఇక్కడి ప్రభుత్వం కూలిపోతే అందుకు మేము ఎంతమాత్రం కారణం కాబోము. ప్రభుత్వాలు పడిపోతే అది కాంగ్రెస్ స్వయంకృతమే అవుతుంది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలున్నాయి. ఎస్.పి, బీఎస్‌పీ మద్దతుతో ప్రభుత్వం నడుస్తోంది. అంతర్గత విభేదాలు ముదిరి ఏదైనా జరిగితే అందుకు మా బాధ్యత ఏమీ ఉండదు' అని ఆయన  అన్నారు.