హైదరాబాద్‌: ప్రముఖ కథానాయకి అమలపాల్ నెలకు 20 వేలు మాత్రమే ఖర్చు పెడుతున్నాని, తన మెర్సిడిజ్ అమ్మేసానని, సైకిల్ మాత్రమే ఉపయోగిస్తున్నని తెలిపింది.   దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌తో తన వివాహ బంధం విఫలమైన తర్వాత ఎక్కడికైనా పారిపోవాలనిపించిందని  అన్నారు. 2014లో విజయ్, అమలాపాల్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల 2016లో విడిపోయారు. 2017లో విడాకులు మంజూరయ్యాయి. 

'చిత్ర పరిశ్రమకు వచ్చినప్పుడు నా వయసు 17 ఏళ్లు. ఆ సమయంలో నాకు ఏమీ తెలియదు. నా పెళ్లి విఫలమైనప్పుడు దాన్ని తట్టుకోలేకపోయాను. ఒంటరిదాన్ని అయిపోయా అనిపించింది. ఎక్కడికైనా పారిపోవాలి అనిపించింది. ఆ సమయంలో చాలా బాధపడ్డా. 2016లో హిమాలయాలకు వెళ్లా. అక్కడ జీవితం పరమార్థం తెలుసుకున్నా. నాలుగు రోజులపాటు మొబైల్‌ ఫోన్‌ లేకుండా గడిపా, టెంట్‌లో నిద్రపోయా. ఆ ట్రిప్‌ తర్వాత నాలో అసంతృప్తి చెందే ధోరణి తగ్గిపోయింది'.

'ఇప్పుడు పాండిచ్చేరిలో సింపుల్‌గా జీవిస్తున్నా. నెలకు రూ.20 వేలు మాత్రమే ఖర్చు పెడుతున్నా. నా మెర్సిడెస్‌ కారు కూడా అమ్మేశా. ఇంటికి కావాల్సిన వస్తువులు కొనడానికి సైకిల్‌పై వెళ్తున్నా. నాకు హిమాలయాల్లో జీవించాలని ఉంది. కానీ అది కష్టం, అందుకే పాండిచ్చేరిని ఎంచుకున్నా. బ్యూటీపార్లర్‌కు వెళ్లడం కూడా ఆపేశా. ముఖానికి కేవలం ముల్తానీ మట్టి, పెసలు పేస్ట్‌ మాత్రం రాస్తున్నా' అని ఆమె అన్నారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన మానసిక, ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.