రాజమండ్రి: కిడ్నాప్‌కు గురయిన బాలుడు జషిత్‌ క్షేమంగా తిరిగి దొరకడంతో  తల్లి తండ్రులు ఆనంద సంద్రంలో మునిగిపోయారు. పోలీసుల కృషిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. జషిత్‌ కిడ్నాప్‌ను పోలీసులు సీరియస్ తీసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారాన్ని స్వయంగా ఎస్పీ నయీం పర్యవేక్షించారు. కుతుకులూరు రోడ్డులో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలివెళ్లారు. చింతాలమ్మ గుడి దగ్గర బాలుడిని కూలీలు గుర్తించారు. తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బాలుడిని వదిలి వెళ్లారని కూలీలు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడు ఉన్న ప్రదేశానికి వెళ్లారు. జషిత్‌ను స్వయంగా ఎత్తుకుని ఎస్పీ నయీం తీసుకొచ్చి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కుతుకులూరు దగ్గర బాలుడిని వదిలి వెళ్లారని, అక్కడి నుంచి తమ బృందం తీసుకొచ్చిందని తెలిపారు. బాలుడు జషిత్‌ ఆరోగ్యంగానే ఉన్నాడని, అతడు కొంత సమాచారం ఇచ్చాడని తెలిపారు. త్వరలోనే కిడ్నాపర్లను పట్టుకుంటామన్నారు. సహకరించిన ప్రజలు, మీడియాకు ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు.