అమరావతి: తమది రైతు పక్షపాత ప్రభుత్వమని,  వారి మేలుకోసం ఏమైనా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఏడాది అక్టోబరు నుంచి రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమలు చేస్తామన్నారు. ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించామన్నారు.రైతుల పంటలకు ప్రభుత్వమే బీమా కడుతుందన్నారు. 64లక్షల మంది రైతులకు సహాయం చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. 
 
రైతాంగం, వ్యవసాయానికి వైసీపీ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకొన్న నిర్ణయాల తీరుపై ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోలో మే నాటికి రైతులకు రూ.12,500 ఇస్తామని వైసీపీ ప్రకటించిందని, ఆ విషయం ఏం చేశారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చేదానితో కలిపి ఆ సాయం ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, మేనిఫెస్టోలో మాత్రం అలాంటి ప్రస్తావనే లేదని విమర్శించారు. 
సీజన్‌ వచ్చినా ఇప్పటి వరకూ రిజర్వాయర్లలో నీళ్లు లేవని, ఎక్కడా సాగు, తాగునీరు దొరకడం లేదన్నారు. గతేడాది పండిన పంటకు గిట్టుబాటు ధర లేదని, విత్తనాలు, ఎరువులు దొరకడం లేదని విమర్శించారు. ‘‘టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతుకు రూ.15వేలు ఇచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 9వేలు, కేంద్రం రూ.6వేలు ఇచ్చాయి. జగన్‌ సర్కారు అంతకంటే ఎక్కువ ఇస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ, ఇస్తామన్న రూ.12,500లో రూ.6వేలు తగ్గించి వారిచేతికి ఇస్తున్నారు. మిగతాది కేంద్రం ఇస్తున్న దానితో కలిపి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు. ఈ ఏడాది రైతులకు లక్ష కోట్ల రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ ప్రభుత్వం రైతులను మభ్య పెడుతోంది’’ అని అనగాని ఆరోపించారు.
 
మంత్రి బొత్స మాట్లాడుతూ మేనిఫెస్టో తమకు బైబుల్‌, ఖురాన్‌, భగవద్గీతతో సమానమని, దాన్ని వందశాతం అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు సున్నా వడ్డీకి రుణాలివ్వాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం విత్తనాల కంపెనీలకు రూ.500 కోట్లు బకాయిలు పడిందని, సున్నా వడ్డీలకు రూ.10వేల కోట్లు ఇవ్వాల్సిన చోట రూ.500కోట్లు మాత్రమే ఇచ్చారని బొత్స విమర్శించారు.  తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతుకు మేలు జరుగుతుందంటే ఏదైనా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.