చిత్రం: డియర్ కామ్రేడ్

రేటింగ్ : 3/5 

నటీటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, శ్రుతి రామచంద్రన్ మొదలగువారు
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఛాయాగ్రహణం: సుజీత్ సారంగ్
మాటలు: జయకృష్ణ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని - యలమంచిలి రవిశంకర్ - మోహన్ చెరుకూరి - యాష్ రంగినేని
రచన - దర్శకత్వం: భరత్ కమ్మ

కొద్ది కాలంలోనే మంచి విజయాలతో దక్షిణ భారతదేశమంతటా అభిమానులను సంపాదించుకొని, దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ, కొత్త డైరెక్టర్  భరత్ కమ్మతో  కలిసి ‘డియర్ కామ్రేడ్’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చక్కటి టీజర్, ట్రైలర్, ఆడియోలతో విడుదలకు ముందే అంచనాలు పెంచిన ఈ చిత్రం, విడుదలకు ముందే స్పెషల్ చూసిన కరణ్ జోహార్ హిందీలో కూడా తీయటానికి సిద్ధమవటం క్రేజ్ మరింత పెంచింది.వెండితెరపై ఈ చిత్రం అంచనాలను అందుకుందో లేదో చూద్దాం. 

కథ:  బాబీ (విజయ్ దేవరకొండ) టైటిలుకు తగ్గట్టు, కమ్యూనిస్టు భావాలున్న కాలేజీ విద్యార్థి సంఘ నాయకుడు. ఆవేశం, కోపం ఎక్కువ. అందరు మంచి హీరోల లాగానే అన్యాయాన్ని సహించలేడు, అధర్మాన్ని ఎదిరించటానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎవ్వరితోనైనా గొడవ పడతాడు.  హైదరాబాద్ నుంచి ఓ పెళ్లి కోసం తన పక్కింటికి వచ్చిన స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ లిల్లీ (రష్మిక మందన్నా)ని  ప్రేమిస్తాడు. బాబీ తరచూ గొడవల్లో ఇరుక్కోవటం నచ్చని  లిల్లీ అతడికి దూరమవుతుంది. ఒకవేపు లిల్లీకి ప్రాణప్రదమైన బాబి, ఎంతో ముఖ్యమైన క్రికెట్, ఇంకొక వైపు ఆమెకు నచ్చని అతడి కోపం, గొడవలు, వాటి వల్ల కష్టనష్టాలు, ఆ ఇద్దరు కలవటానికి  ఎదురైన ఇబ్బందులని ఎలా అధిగమించారు. క్లుప్తంగా ఇదీ కథ. 

 విశ్లేషణ:
మంచి విందు భోజనంలో ఉప్పు వేయడం మరచినట్టు, మంచి కథని ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా తీసి కొన్ని చిన్న చిన్న తప్పులతో సెకండ్ హాఫ్ మందగించడం వలన ఒక సూపర్ హిట్ సినిమా మనకు దూరయ్యింది. దర్శకుడు ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రల్ని చక్కగా మలిచాడు.  ఆ పాత్రలకు మంచి జోడీని ఎంచుకున్నాడు. వాళ్ళ మధ్య రొమాన్స్, ఎమోషన్స్ బాగా ఉపయోగించుకున్నాడు. మంచి పట్టుతో సినిమా ఒక స్టేజ్ వరకు బాగా నడిపించాడు. దురదృష్టవశాత్తు, సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ మంచి సినిమా చూస్తున్న అనుభూతి ప్రేక్షకులకు తగ్గుతూ వచ్చి, క్లైమాక్స్ వచ్చేటప్పటికి  అతి సాధారణ చిత్రంగా  మారిపోతుంది.ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అనేక విషయాలు ఒకేసారి చొప్పించటంతో సినిమా గాడి తప్పిందనిపిస్తుంది. ప్రేమ, కమ్యూనిజం, క్రికెట్ పోలిటిక్స్, అన్యాయాలు,గొడవలు అన్నీ కలగలసి ఒక అందమైన అనుభవం కాస్తా అతి మామూలు సినిమా అయ్యింది. 

ఏది ఏమైనా భరత్ కమ్మలో ఒక మంచి దర్శకుడు ఉన్నాడనే స్పస్టమయ్యింది. సినిమా మొదట్లోనూ, అక్కడక్కడా హృదయాన్ని ఆకుట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. ఒక మామూలు ప్రేమకథలా కాకుండా, సబ్జెక్టు చక్కగా ఎన్నుకున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల దగ్గరి నుంచి సినిమాకు  కావలసినంత పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. 
వారి మధ్య ప్రేమ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించాడు. అందమైన సన్నివేశాలు, మంచి సంగీతం, మనసుకు హత్తుకునే సినిమాటోగ్రఫితో మొదటి హాఫ్ అంతా సమయం తెలియకుండా గడిచిపోతుంది. ద్వితీయార్ధం సినిమా పక్క దారి పట్టింది. క్రికెట్ రాజకీయాలు, లైంగిక వేధింపులు అనవసరంగా ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది. చిత్రాన్ని ఊహించని మలుపులు తిప్పడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. 

తెరముందు స్టార్స్

విజయ్ దేవరకొండ మరోసారి మంచి  పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు.  తన  నటన  డైలాగ్ డెలివరీతో ప్రతి సన్నివేశంలోనూ బలమైన ముద్ర వేశాడు . ఎమోషనల్ సీన్లలో విజయ్ నటన గుర్తుండిపోతుంది.  కానీ రష్మిక నటన మాత్రం చిత్రానికి హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా అంతా ప్రధానంగా తన చుట్టూనే తిరిగే అత్యంత కీలకమైన పాత్రలో రష్మిక రాణించింది. తీవ్ర మానసిక సంఘర్షణ అనుభవించే సన్నివేశాల్లో రష్మిక నటన ప్రేక్షకులకు కలకాలం గుర్తుంది పోతుంది. హీరోయిన్ అక్క పాత్రలో శ్రుతి రామచంద్రన్. వారి వారి పాత్రలకు తగ్గట్టు మిగతా తారాగణం నటించారు. 


తెరవెనుక స్టార్స్: 

‘డియర్ కామ్రేడ్’లో సాంకేతిక నిపుణులందరి పనితీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇటీవల మంచి సంగీతంతో వచ్చిన చిత్రాలలో   ‘డియర్ కామ్రేడ్’ది ఒకటనడంలో సందేహం లేదు.  కడలల్లే,నీ నీలి కన్నుల్లోన, గిర గిర, పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా చిత్రానికి బలం చేకూర్చింది.  సుజీత్ సారంగ్ ఛాయాగ్రహణం కూడా ఆహ్లాదకరంగా ఉంది.  జయకృష్ణ డైలాాగులు సహజంగా ఉండి ఆకట్టుకుంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ - బిగ్ బెన్ సినిమాస్ ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిద్దమని ప్రయత్నిచారు.  భరత్  ఒక మంచి దర్శకుదనడంలో సందేహం లేదు. కానీ వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేదనే చెప్పాలి. కథలో పట్టును చివరి వరకు ఉంచటంలో విఫలమయ్యడనే  అనిపిస్తుంది. ఎమోషన్స్, రొమాన్స్ బాగా పండిచాడు.  


Disclaimer : This Review is an Opinion of a single person.  Please do not judge the movie based on this review. Watch the Movie on screen.