అమెరికా మోడల్‌, బిజినెస్‌ విమెన్‌ కైలై జెన్నర్‌ పోస్టుకు రూ.8.74కోట్లు..

ప్రియాంక చోప్రా పోస్ట్‌కు రూ.1.87కోట్లు, విరాట్ పోస్టుకు రూ.1.35కోట్లు

ఒకసారి సెలబ్రిటీ స్టేటస్ సంపాదించిన తరువాత, ఆ సెలబ్రిటీల సంపాదన  సోషల్ మీడియా పోస్టుల ద్వారా కోట్లలో ఉండి, సినిమాల ద్వారా, ప్రకటనల ద్వారా పొందే ఆదయంతో పోటీ పడుతోంది.  తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న వారి వివరాలను సోషల్‌మీడియా మేనేజ్‌మెంట్‌ కంపెనీ హాపర్‌ హెచ్‌క్యూ ‘2019 ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌ లిస్ట్‌’ పేరుతో విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా మోడల్‌, బిజినెస్‌ విమెన్‌ కైలై జెన్నర్‌ అగ్ర స్థానంలో ఉన్నారు. ఆమె ఇన్‌స్టాలో చేసే ఒక్కో స్పాన్సర్‌ పోస్ట్‌కు 1.266 మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తారట అంటే మన కరెన్సీలో రూ.8.74కోట్లు. ఆమె తర్వాత గాయని ఆరియానా గ్రాండ్‌ ఉన్నారు. ఈమె ఒక్కో పోస్ట్‌కు 996,000 డాలర్లు(రూ.6.87కోట్లు) ఛార్జ్‌ చేస్తారని హాపర్‌ తెలిపింది. ఇక భారత్‌కు చెందిన గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా ఒక్కో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు 271,000 డాలర్లు (రూ.1.87కోట్లు) వసూలు చేస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను మొత్తం 43 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. హాపర్‌ విడుదల చేసిన జాబితాలో ప్రియాంక 19వ స్థానంలో ఉంది. ఇక టీమిండియ కెప్టెన్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ ఒక్కో స్పాన్సర్‌ ఇన్‌స్టా పోస్ట్‌ ద్వారా రూ.1.35కోట్లు ఆర్జిస్తున్నారు.