దిల్లీ:  కార్గిల్ విజయం మన సమర్ధతకి చిహ్నం అని ప్రధాని నరేంద్ర మోడీ  అన్నారు. దేశ భవిష్యత్‌ను కాపాడే నిజమైన వీరులు సైనికులేనన్నారు. శనివారం రాత్రి దిల్లీలోని ఇందిరా గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమంలో  ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘ కార్గిల్‌ అమరవీరులకు నా ప్రణామాలు అర్పిస్తున్నా. కార్గిల్‌ విజయం భారత్‌ సామర్థ్యానికి, మన సైనికుల కర్తవ్యానికి ప్రతీక. కార్గిల్‌ విజయం తర్వాత మన సైనికులు మంచుకొండల్లో త్రివర్ణపతాకం ఎగురవేశారు. కార్గిల్‌లో పోరాడిన సైనికులు నిజమైన యుద్ధవీరులు.  అమరత్వం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం’’ అని అమరవీరుల త్యాగాలను మోదీ కొనియాడారు.
 సైనికులే నిజమైన హీరోలు:
‘‘ఎక్కడైనా సైనికులే నిజమైన హీరోలు. సైనికుల వెంటే దేశ మొత్తం ఉంది. అమరవీరులు శరీరాలు నెల తాకిన ప్రదెశాలు  అన్నీపుణ్యక్షేత్రాల కన్నా పవిత్రమైనవి. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని ఈ దేశం ఎప్పుడూ  గుర్తుంచుకుంటుంది. ఐదేళ్లుగా సైనికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఒకే ర్యాంకు - ఒకే పింఛను డిమాండ్‌ను నెరవేర్చాం. అమరులైన సైనికుల పిల్లల సంరక్షణ బాధ్యతల్ని తీసుకున్నాం. వాజ్‌పేయీ ప్రభుత్వం  శత్రువుకు తగ్గ జవాబు చెప్పింది. కార్గిల్‌ విజయం మన సైన్యం శక్తిని  ప్రపంచానికి చాటి చెప్పింది. భారత్‌ తలపడిన ప్రతిసారీ పాకిస్థాన్‌కు మన సైనికులు మంచి  సమాధానం చెప్పారు.  భారత్‌ ఎప్పుడూ ఆక్రమణదారు కాదు. మనది శాంతికోరుకునే దేశం. భారత్‌ ఎప్పుడూ శాంతి కోసమే ప్రయత్నించింది’’ అని ప్రధాని అన్నారు.