ఇక పోరాడలేనంటూ కాఫీడే ఉద్యోగులు, డైరెక్టర్లకు లేఖ

బెంగళూరు: కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడు,  వి.జి సిద్ధార్థ అదృశ్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్న సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది దగ్గర కన్పించకుండా పోయారు. దీంతో ఆయన ఏమయ్యారన్నది పెద్ద మిస్టరీగా మారింది.  సిద్ధార్థ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిద్ధార్థ కోసం 200 మందికి పైగా పోలీసులు గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. వంతెనపై నుంచి నదిలోకి దూకి ఉంటారనే అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. మాయమవటానికి ముందు సిద్ధార్థ  కాఫీడే ఉద్యోగులు, కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు రాసిన లేఖే ఈ వాదనలకు కారణమయ్యింది. 

సిద్ధార్థ రాసిన లేఖను కొన్ని జాతీయ మీడియా ప్రచురించాయి. ‘37ఏళ్ల నా కృషితో 30వేల మందికి ప్రత్యక్షంగా, 20వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించాను. అయితే ఎంత ప్రయత్నించినా లాభదాయక వ్యాపారాన్ని సృష్టించడంలో విఫలమవుతున్నా. ఎప్పటినుంచో  పోరాడుతూనే ఉన్నా. ఇక పోరాడే ఓపిక  లేదు. అందుకే అన్నీ వదిలేస్తున్నా. ఓ ప్రయివేటు ఈక్విటీలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్‌ చేయమని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఇక మీద ఎలాంటి ఒత్తిడిని నేను తీసుకొను. . గత ఆదాయపు పన్ను డీజీ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా. నాపై మీరంతా ఎంతో నమ్మకం ఉంచారు. దాన్ని వమ్ము చేస్తున్నందుకు క్షమించండి.  మీరంతా బలంగా కొత్త యాజమాన్యంతో ఈ వ్యాపారాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నా. నా తప్పులన్నింటికీ నాదే బాధ్యత. నా లావాదేవీల గురించి మా మేనేజ్‌మెంట్‌కు, ఆడిటర్లకు తెలియదు. వాటికి నేనే జవాబుదారిని. నేను ఎవర్నీ మోసం చేయాలనుకోలేదు. నేను వ్యాపారంలో విఫలమైన వ్యక్తిని. నన్ను క్షమించండి’ అని సిద్ధార్థ ఆ లేఖలో పేర్కొన్నారు.