ఎం‌ఎల్‌ఏ పుత్ర రత్నం  అధికార మదం 


మాదాపూర్‌, న్యూస్‌టుడే: ఓ ఎమ్మెల్యే కుమారుడు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులను  దూషించి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను కాలితో తన్నాడు.  మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఖానామెట్‌ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. రద్దీ నియంత్రణలో భాగంగా హైటెక్స్‌ కమాన్‌ వైపు నుంచి వస్తున్న వాహనాలను కొద్ది సేపు నిలిపాడు. అటుగా వచ్చిన ఓ కారు నిబంధనలు అతిక్రమించి ముందుకు సాగుతుండటంతో వారించాడు. కారులో నుంచి దిగిన ఏపీ ప్రభుత్వ విప్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు సామినేని ప్రసాద్‌ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. ‘‘నన్ను నువ్వు అంటావా’’ అంటూ దుర్భాషలాడాడు. రోడ్డుకు అవతలివైపు విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి అక్కడి చేరుకుని అతన్ని వారించే ప్రయత్నం చేశాడు. అతను లక్ష్యపెట్టకపోవడంతో స్టేషన్‌కు రావాల్సిందిగా కోరారు. ఈ పరిణామంతో  ఆగ్రహించిన ప్రసాద్‌ ‘‘నన్ను స్టేషనుకు రమ్మంటావా?’ అంటూ ఇన్‌స్పెక్టర్‌ను పక్కకు నెట్టే, కాలుతో తన్ని దూషించాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మిగతా పోలీసుల సాయంతో సీఐ అతన్ని అదుపులోకి తీసుకుని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే తనయుడిపై 332, 353, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు మాదాపూర్‌ పోలీసులు వెల్లడించారు.