హైదరాబాద్: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన డిగ్రీ యువకుడినీ, అతనికి సహకరించిన అతడి స్నేహితుడినీ   పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలికను  ప్రేమిస్తున్నానని, పెళ్లాడతానంటూ డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు(20) వేధించేవాడు. నాలుగు రోజుల క్రితం అతడు ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఫొటోలు ఇంటర్‌నెట్‌లో పెడతానంటూ బెదిరించాడు. తర్వాత ఓ రోజు అతడు బాలికను పార్కుకు తీసుకెళ్లి, అసభ్యంగా ప్రవర్తించాడు.
 
బాలిక ద్వారా ఈ  విషయం ఆమె సోదరుడికి చెప్పడంతో, ఆమె సోదరుడు ఆ యువకుడిని తీవ్రంగా హెచ్చరించాడు. సోమవారం ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తుండగా అడ్డగించిన సదరు యువకుడు, అతని స్నేహితుడి(24)తో కలిసి కారులో ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. ఓ నిర్జన  ప్రదేశంలో ఆమెపై అతడు అత్యాచారానికి జరపగా మరో యువకుడు వీడియో తీశాడు. ఆ తర్వాత వారు ఆ బాలికను ఇంటి వద్ద వదిలివెళ్లారు. మంగళవారం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.