హైదరాబాద్: సినిమాలలో వేషాలు ఇప్పిస్తానంటూ, మంచి కంపనీలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ జల్సాల కోసం మోసం చేసినా ఓ వ్యక్తి కతకల పాలయ్యడు.  డిగ్రీ వరకు చదివి, దానికి తగ్గ ఉద్యోగం సంపాదించుకొని కూడా పబ్బులకు వెళ్ళాలి, ఖరీదైన కార్లలో తిరగాలి,  విలాసలు అనుభవించాలన్న అత్యాశతో అనంతపూర్‌ జిల్లా పుట్టపర్తి మండలం రచ్చవారిపల్లి గ్రామానికి చెందిన కందూరి రాజేష్‌ అలియాస్‌ కె.రమేష్ బాబు అలియాస్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, తాను బాగా డబ్బున్నవాడిలాగా, రాజకీయ నేపధ్యం ఉన్నవాడిలాగా, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నట్టు నటించేవాడు. అలా పై మెరుపులతో మోసం చేస్తూ దొరికిన వారీనందరినీ వీలయినంత మోసం చేసి, చివరకు జైలు పాలయ్యాడు.  

పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాసరావు చెప్పిన వివరాల ప్రకారం,  రాజేష్  స్నేహితుల పేర్ల మీద క్రెడిట్‌ కార్డులు తీసుకొని వాటితో ఖరీదైన కార్లలో తిరుగుతూ దర్జాగా బతికేవాడు. కార్డు తాలూకు బిల్లులు కట్టలేక స్నేహితులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజేష్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. తన పద్ధతిని ఏమాత్రం మార్చుకొని ఆయన, ఏరియా మాత్రం మార్చి, నిర్మాత అవతారం ఎత్తాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 5లో ‘హల్లో భరత్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పేరిట ఓ సినిమా కార్యాలయాన్ని తెరిచాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ సోషల్‌మీడియా ద్వారా యువతులకు ఏర వేశాడు. భారీ పెట్టుబడులతో సినిమాలు నిర్మిస్తున్నట్టు ప్రకటించుకున్నాడు. నటించే అవకాశం కల్పిస్తానంటూ అందమైన అమ్మాయిలు తన వెంట పడేలా చేసుకున్నాడు. వారి వద్ద డబ్బు వసూలు చేశాడు. పరిచయాలు పెంచుకున్నాడు. 

 ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడిన ఓ అమ్మాయికి  తన సినిమాలలో కాస్టూమ్స్‌ డిజైనింగ్‌ పని అప్పగిస్తానని నమ్మించాడు. ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఆ అమ్మాయి ఇంజినీరింగ్ చదివిన తన  తమ్ముడికి ఉద్యోగం కావాలంది. బి‌హెచ్‌ఈ‌ఎల్ లో ఇప్పిస్తానని పలు దఫాలుగా రక రకాల సాకులు చెప్పి 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ అమ్మాయి వత్తిడి చేయడంతో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అనుమానం వచ్చిన ఆ అమ్మాయి వాకబు చేయగా మోసగాడని తేలింది. దీంతో ఆమె జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఉద్యోగాల పేరిట 14మంది నుంచి సుమారు రూ.90 లక్షలు వసూలు చేసినట్టు తేలింది. గతంలో కేపీహెచ్‌బీ, బంజారాహిల్స్‌, చైతన్యపురి, మాదాపూర్‌, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లలో కూడా అతనిపై కేసులు ఉన్నట్టు తెలిసింది.  నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ తెలిపారు. రంగు రంగుల వేషాలతో, రకరకాల మోసాలు చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.