హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ సినిమాతో రంగప్రవేశం చేస్తున్న  సంగతి తెలిసిందే. బుచ్చిబాబు    దర్శకత్వం వహిస్తున్నఈ  చిత్రాన్ని,  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి సుకుమార్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాకు సంగీతం  అందిస్తున్నారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి  ప్రతినాయకుడి   పాత్ర పోషించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

అయితే ఇప్పుడు విజయ్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఉప్పెన’ షూటింగ్‌ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో డేట్స్‌ కుదరకపోవడంతో విజయ్‌ వైదొలిగినట్లు సమాచారం. దీంతో ప్రతినాయకుడి పాత్రకు సరిపోయే మరో నటుడ్ని ఎంచుకోవడానికి యూనిట్‌ ప్రయత్నిస్తోందట. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. విజయ్‌ తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం ఆయన పలు తమిళ సినిమాల షూటింగ్‌లతో చాలా బిజీగా గడుపుతున్నారు. దీంతో ‘ఉప్పెన’ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం.