4 పరుగుల అసలు నిజం బెన్‌స్టోక్స్‌ ద్వారా...

లండన్‌: చరిత్రాత్మక ప్రపంచకప్‌ ఫైనల్లో తన బ్యాటు ద్వారా వచ్చిన ఓవర్‌త్రో నాలుగు పరుగులను రద్దు చేయమని అంపైర్లను అడగలేదని ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ నిజం చెప్పేశాడు.  న్యూజిలాండ్‌ ఆటగాళ్లను  క్షమాపణ మాత్రం కోరాననిఅన్నాడు.  లార్డ్స్‌ వేదికగా నరాలు తెగే ఉత్కంతతో  సాగిన ఫైనల్ మ్యాచ్  చివరి ఓవర్‌ ప్రపంచ కప్ చరిత్రలోనే అనూహ్య సంఘటనలకు కారణమైంది.

ట్రెంట్‌బౌల్ట్‌ వేసిన ఈ ఓవర్‌లో నాలుగో బంతిని స్టోక్స్‌ ఆడాడు. ఒక పరుగు తీశాడు. బంతిని ఫీల్డర్‌ గప్తిల్‌ అందుకున్నప్పటికీ రెండో పరుగుకు ప్రయత్నించాడు. క్రీజులోకి చేరుకొనేందుకు స్టోక్స్‌ డైవ్‌ చేశాడు. అతడు గాల్లో ఉన్నప్పుడే గప్తిల్‌ విసిరిన బంతి బ్యాటుకు తగిలి బౌండరీ దాటింది. అంపైర్లు 2+4 మొత్తం ఆరు పరుగులు ఇచ్చారు.

పరిస్తితి చూసిన నేను,  నాలుగు పరుగులు రద్దు చేయాలని అడగాలా అని నాలో నేనే ఆలోచించుకున్నాను. నిజం చెబుతున్నాను. నేను అంపైర్ల వద్దకు వెళ్లలేదు. ఏమీ చెప్పలేదు’ అని స్టోక్స్‌ బీబీసీ వార్తాసంస్థతో చెప్పాడు. ‘ఆ దృశ్యం చూసిన తర్వాత నేను నేరుగా టామ్‌ లేథమ్‌ వద్దకెళ్లి క్షమాపణ కోరాను. అక్కడి నుంచే న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ వైపు మళ్లి సారీ చెప్పా’ అని బెన్‌ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌ అద్భుత ప్రదర్శనతోనే ఇంగ్లాండ్‌కు జగజ్జేత కిరీటం దక్కింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత స్టోక్స్‌ అంపైర్ల వద్దకెళ్లి ఆ నాలుగు పరుగులు తీసేయాలని  ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జిమ్మీ అండర్సన్‌ చెప్పిన  మాటలు అబద్ధమని తేలింది.