గుంటూరు: కాపు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. తెదేపా ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరైన విధానం కాదన్నారు. ఈ అంశంపై సీఎం జగన్‌కి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. గుంటూరులో కన్నా మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన పేదలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్లలో ఈ వెసులుబాటు ఉందని చెప్పారు. సామాజిక స్థాయి ఆధారంగా కమిషన్ వేసి వర్గీకరణ చేసుకోవచ్చనే మినహాయింపు కేంద్ర చట్టంలో ఉందన్నారు. మన రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా మంజునాథ కమిషన్ వేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ముస్లిం మహిళల రక్షణకి,  ఆత్మవిశ్వాసాన్నిపెంచేందుకే చారిత్రాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చిందని అన్నారు.