మనిఫెస్టోలోని అన్నీ అంశాలను అమలు చేస్తున్నాం... 
అమరావతి: నవరత్నాల ద్వారా మేలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు.  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సమన్యాయం జరగాలని ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాహసోపేత నిర్ణయమన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు, స్థానిక పరిశ్రమల్లో 75 శాతం రిజర్వేషన్లతో యువతకు ఉద్యోగ భద్రత కలుగుతుందని తెలిపారు.  రైతులకు స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు భరోసాగా కొత్త చట్టం, పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు.