వెంటనే పరిహారం అందచేయండి ...

ప్రత్యేక విమానంలో పేషంట్లని డిల్లీకి తరలించండి... 
ఉన్నావ్ కసులన్నీ డిల్లీకి బదిలీ చేయండి...  


న్యూఢిల్లీ: పరిహారం ఇవ్వకపోతే మనం విఫలమైనట్లే అని ఉన్నావ్ అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. ఈ కేసులో  సుప్రీంకోర్టు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బాధితురాలికి, ఆమె కుటుంబానికి పరిహారం అందజేయాలంటూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించనున్నట్టు పేర్కొంది. . ఉన్నావ్ బాధితురాలు ప్రమాద ఘటన కేసులో వారం రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించారు. ఉన్నావ్ ఘటనకు సంబంధించి  జస్టిస్ గొగోయ్ నేతత్వంలోని ధర్మాసనం, అధికారుల వైఫల్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
 పరిహారం ఎంత ఇవ్వాలన్నది చట్టప్రకారం ఎన్ఏఎల్ఎస్ఏ నిర్ణయించాల్సి అంశమంటూ ప్రభుత్వ  న్యాయవాది అనడంతో  జస్టిస్ గొగోయ్ మండిపడ్డారు. ‘‘ ఏం జరుగుతోంది ఈ దేశంలో? పరిహారం కల్పించని పక్షంలో మనం విఫలమైనట్టే. మీరేమో చట్టం గురించి మాట్లాడుతున్నారు..’’ అంటూ ఆయన కోపంగా అన్నారు. ఇదే కాక  ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్నావ్ బాధితురాలు, ఆమె లాయర్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్ తరలించే అంశాన్ని కూడా సుప్రీం పరిశీలిస్తోంది. వారు కదల్లేని పరిస్థితుల్లో ఉన్నందున ప్రత్యేక విమానంలో తరలించేందుకు వీలవుతుందా లేదా అనేది ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా చెప్పాలంటూ కింగ్ జార్జ్ ఆస్పత్రిని ఆదేశించింది. ఉన్నావ్ ఘటనకు సంబంధించి విచారణలో ఉన్న మొత్తం ఐదు కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్నీ రాజ్యాంగ సంస్థల మీద సామాన్యులకు నమ్మకం సడలిన ఇలాంటి తరుణంలో సుప్రీం కోర్టు కలిపించిన భరోసాతో, ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికేఉందని మరో సారి రూఢీ అయ్యింది.