ఎడ్జ్‌బాస్టన్‌: ఇక్కడ ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాల మధ్య మొదలైన యాషెస్‌ టెస్ట్ సెరీస్ మొదటి టెస్ట్ చూడటానికి వచ్చిన కొందరు అభిమానులు ఇంగ్లాండ్‌ ఛాంప్స్‌ -  ఆసీస్‌ ఛీట్స్‌  అంటూ ప్లకార్డులు ప్రదర్శింధారు. గతేడాది బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా నిషేధానికి గురై మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌కు ఇంగ్లాండ్‌ అభిమానుల నుంచి చేదు అనుభవం తప్పలేదు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మొదలైంది. ముందుగా టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాతీయగీతం ఆలపిస్తుండగా కొంతమంది ఇంగ్లాండ్‌ అభిమానులు ట్యాంపరింగ్‌కు ఉపయోగించే సాండ్‌పేపర్‌ను చూపిస్తూ హేళన చేశారు. మరికొంతమంది అభిమానులైతే ఏకంగా ‘ఇంగ్లాండ్‌ ఛాంప్స్‌.. ఆసీస్‌ ఛీట్స్‌’ అంటూ ప్లకార్డులు చూపించారు. ఇటీవల ప్రపంచకప్‌లో కూడా  డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌కు ఇలాంటి నిరసనలే వ్యక్తం కాగా, ఇంకొక అడుగు ముందుతో తాజాగా యాషెస్‌లోనూ ఇంగ్లాండ్‌ అభిమానుల నుంచి మళ్లీ ఇలాంటి ఘటనలే ఎదురుకావడం  చూస్తే  డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ల తెంపరితనాన్ని  ఇప్పుడప్పుడే అభిమానులు మర్చిపోయేటట్టు లేదు.