‘కేజీఎఫ్‌-2’  లో కీలక పాత్ర.... 

హైదరాబాద్‌: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గతేడాది విడుదలైన ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-1’లో సంజయ్‌దత్‌ కోసమే అధీర పాత్ర అని  మరొక నటుడిని అనుకోలేదని, ఆ చిత్ర కథానాయకుడు యశ్‌ తెలిపారు. ఈ సినిమా  బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’ తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. 

ఇందులో అధీర పాత్రను పోషిస్తున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌  పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా కథానాయకుడు యశ్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్‌’ సినిమా తీయాలని అనుకున్నప్పుడు అధీర పాత్రకు సంజయ్‌దత్‌ తప్ప మరొక నటుడిని అనుకోలేదని వెల్లడించారు. ‘సినిమా అనుకున్న రోజు నుంచి అధీర పాత్రకు మా మొదటి ప్రాధాన్యం సంజయ్‌దత్‌. కేవలం కన్నడలోనే తీద్దామని అనుకున్నప్పుడు కూడా ఆ పాత్రకు సంజయ్‌ అయితేనే బాగుంటారని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో సహా అందరం గట్టిగా అనుకున్నాం. మొదటి భాగంలోనే ఆయన నటించాల్సి ఉంది. కానీ, అప్పుడు సంజయ్‌కు డేట్స్‌ కుదరలేదు. దీంతో ఆయన ముఖం కనపడకుండా కేవలం చేతిని మాత్రమే చూపించాం’ అని యశ్‌ పేర్కొన్నాడు. ఇక సంజయ్‌దత్‌తో పాత్ర పోషించటం, ఆయన ఇమేజ్  సినిమాకు అదనపు బలం . సంజయ్‌ అద్భుతమైన నటుడు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు యశ్. రెండవ భాగం ఇంకా బాగా వచ్చిందని, ‘‘కేజీఎఫ్‌-1 చిత్రీకరణ సమయంలో ఉన్న భయం, పరిమితులు ఇప్పుడూలేవు. ఆ చిత్ర విజయం మాలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అంతా ‘కేజీఎఫ్‌:చాప్టర్‌-2’ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.