సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి...

రేపు  అంత్యక్రియలు... 

 హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నటనా శిక్షకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం సాయంత్రం ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.  ఆయన వయస్సు 74 ఏళ్లు. దేవదాస్‌ కనకాల 1945లో జులై 30న యానాంలో జన్మించారు. పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యనభ్యసించిన తొలితరం నటుడైన దేవదాసు కనకాల తరువాత కాలంలో నటనా శిక్షణా సంస్థను నెలకొల్పారు. 

సిరిసిరి మువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్‌లీడర్‌ వంటి అనేక చిత్రాల్లో దేవదాస్‌ నటించారు. చివరగా భరత్‌ అనే నేను చిత్రంలో ఆయన నటించారు. ప్రముఖ నటులు రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్‌, భానుచందర్‌, రఘువరన్‌, నాజర్‌, మొదలైన ఎంతోమంది స్టార్స్  దేవదాస్‌ వద్దే శిక్షణ పొందారు. ప్రముఖ నటుడు  రాజీవ్‌ కనకాల ఆయన కుమారుడు.  కోడలు సుమ చిత్ర పరిశ్రమలో, బుల్లి తెర మీద ఎంతో గుర్తింపు సంపాదించారు. 2018లో తన సతీమణి లక్ష్మి మృతిచెందడం ఆయనను ఎంతోగానో కలిచివేసింది. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురవ్వడంతో ఇటీవల ఆయనను కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందినట్టు రాజీవ్‌ కనకాల వెల్లడించారు.

దేవదాస్ కనకాల భౌతికకాయాన్ని రేపు ఉదయం 8గంటలకు మణికొండలోని ఇంటికి తెసుకెళ్లనున్నారు. ఉదయం 11:30గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సినీపరిశ్రమ దిగ్భ్రాంతి: 
దేవదాస్‌ కనకాల మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు,  పలువురు సినీ నటులు, అభిమానులు   కిమ్స్‌ ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.