జమ్ము& కాశ్మీర్ సందర్శించనున్న అమిత్ షా....
అమిత్ షా, అజిత్ దోవల్ భేటీ...

 టూరిస్టులను, అమరనాథ్ యాత్రీకులను వెంటనే లోయ వదలి వెళ్లవలసిందిగా సలహా ఇచ్చిన నేపథ్యంలో హోమ్ మంత్రి  అమిత్ షా యాత్ర అమిత ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ సమావేశాలు పూర్తి కాగానే ఆయన రాష్ట్రాన్ని దర్శించనున్నారని అధికారులు చెప్పారు. మొదట జమ్ము ప్రాంతాన్ని పరిశీలించి ఆ తరువాత లోయని సందర్శించనున్నారు.  

ఉగ్రవాదుల దాడులు జరుగ వచ్చు అంటున్న ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం టూరిస్టులను, అమరనాథ్ యాత్రీకులను వెంటనే లోయ వదలి వెళ్లవలసిందిగా శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం  కోరింది. ఈ వార్త విన్న స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. దుకాణాలు, మందుల షాపులు, ఏ‌టి‌ఎం ల వద్ద  పెద్ద పెద్ద లైన్లు కనిపించాయి. 
శ్రీనగర్ ఎయిర్ పోర్టులో తిరుగు ప్రయాణం కోసం వచ్చిన దేశీయ, విదేశీ ప్రయాణీకులతో కిక్కిరిసి పోయింది. టికెట్లు దొరకక చాలా మంది అవస్థలు పడుతున్నారు. శ్రీనగర్ నుండి బయటకు వెళ్ళే వాహనాలన్నీ ప్రయాణీకులతో పూర్తిగా నిండిపోయాయి.

అజిత్ దోవల్, అమిత్ షాల మంతనాలు 
జమ్ము కాశ్మీర్లో సైనిక దళాలని అప్రమత్తం చేసి, అదనపు బలగాలను పంపింఛిన నేపధ్యంలో, ఈ రోజు అజిత్ దోవల్, అమిత్ షాల భేటీ ప్రత్యేక ప్రాధాన్యతని సంతరించుకుంది

ఈ పరిణామాలు గమనించిన ప్రజలలో,  ఇంతకాలం తమకు ఉద్యోగాలలో, భూమి మీద ప్రత్యేక హక్కు కల్పించిన రాజ్యాంగలోని 35A అధికరణం తీసి వేస్తారేమోనన్న ఆందోళన ఎక్కువైయ్యింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చర్యల వల్ల జమ్ము కాశ్మీరులోని ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది.